‘హీరా’ ఇన్వెస్టర్లలో ఉగ్రవాదులు?

Police Suspicion On Hire Group Investors - Sakshi

అనుమానితుల జాబితా సిద్ధం

పూర్తి వివరాలు తెలపాల్సిందిగా ఏజెన్సీలకు లేఖలు రాసిన పోలీసులు

ఎనిమిది విదేశీ సంస్థల బ్యాంకుల్లో ఖాతాలు గుర్తింపు

ఫెమాను ఉల్లంఘిస్తూ రూ.కోట్లలో పెట్టుబడులు

దీనిపై ఈడీకి సమాచారమిచ్చిన దర్యాప్తు అధికారులు

మిస్టరీగా కొచ్చిన్‌లోని హోటల్‌ వ్యవహారం

సాక్షి, హైదరాబాద్‌: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కేసు దర్యాప్తులో అనేక చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నౌహీరా షేక్‌ నేతృ త్వంలో నడిచిన ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉగ్రవాదులూ ఉన్నట్లు సీసీఎస్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల జాబితా రూపొందించిన దర్యాప్తు అధికారులు ఈ అనుమానం నివృత్తి చేసుకోవడానికి ఆయా ఏజెన్సీలకు లేఖలు రాశారు. మరోపక్క విదేశీ డిపాజిట్ల విషయంలో ఫెమా చట్టం ఉల్లంఘన జరిగినట్లు దర్యాప్తు అధికా రులు తేల్చారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసుల వద్ద ఉన్న నౌహీరా షేక్‌ను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

సర్వర్‌ విశ్లేషణతో కీలకాంశాలు...
అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్‌ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గుర్తించారు. దీంతో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌లను విశ్లేషించారు. ఇందులోని వివరాల ఆధారంగా డిపాజిటర్లకు చెందిన జాబితాను సేకరించిన విషయం విదితమే. కాగా దర్యాప్తు అధికారులకు నిఘా వర్గాల నుంచిఓ జాబితా అందింది. అందులో దేశ వ్యాప్తంగా వివిధ ఉగ్రవాద సంబంధ కేసుల్లో అరెస్టయిన, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లను ఉన్నాయి. హీరా గ్రూప్‌లో ఉన్న డిపాజిట్‌దారుల జాబితాలో వీరి పేర్లు ఉండే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు ఉప్పందించాయి. దీంతో ఈ కోణంలో విశ్లేషించిన సీసీఎస్‌ పోలీసులు ఆయా ఉగ్రవాదుల పేర్లను పోలిన వాటిని డిపాజిట్‌దారుల జాబితాలో గుర్తించారు. ఆ ఉగ్రవాదులు, ఈ డిపాజిట్‌దారులూ ఒకరేనా అనేది నిర్థారించడం కోసం ఆయా కేసుల్ని పర్యవేక్షిస్తున్న అంతరాష్ట్ర, జాతీయ ఏజెన్సీలకు లేఖలు రాశారు. వారిచ్చే సమాధానాలను బట్టి ఈ కీలకాంశం ధ్రువీకరించే ఆస్కారముందని ఓ అధికారి పేర్కొన్నారు. 

విదేశీ డినామినేషన్లలోనే లావాదేవీలు...
హీరా గ్రూప్‌ది దాదాపు రూ.8 వేల కోట్ల స్కామ్‌గా అనుమానిస్తున్న సీసీఎస్‌ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తూ సేకరించిన రికార్డులను విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గ్రూప్‌ ఫెమా చట్టాన్ని ఉల్లంఘిచినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే హీరా గ్రూప్‌ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు ఆరు లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైడ్‌ దీనార్స్‌ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుబడులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్‌ భారత్‌ కరెన్సీలో రూ.2,500 కోట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షలు సౌదీ రియాల్స్‌ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితో పాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాంకు ఖాతాలను సీసీఎస్‌ పోలీసులు గుర్తించారు. ఈ వివరాలన్నీ క్రోడీకరిస్తూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌కు లేఖలు రాశారు. 

సకుటుంబ సపరివార సమేతంగా...
హీరా స్కామ్‌ కేసులో నిందితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నౌహీరాతో పాటు ఆమె కుటుంబీకులకు ఇందులో భాగమున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్, సీఈఓ నౌహీరా షేక్‌ నిందితులుగా ఉన్నారు. తర్వాత దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి ఆ సంస్థకు చెందిన బిజూ థామస్, మోల్లీ «థామస్‌ను అరెస్టు చేశారు. దర్యాప్తు సాగుతున్న కొద్దీ నిందితుల సంఖ్య పెరుగుతోంది. నౌహీరా కుమారుడైన అబు బకర్‌ను నిందితుడిగా పరిగణించిన సీసీఎస్‌ పోలీసులు సీఆర్పీసీ 41 (ఏ) నోటీసులు జారీ చేశారు. చేవెళ్లలో ఓ కళాశాలను నిర్వహిస్తున్న ఇతడు దుబాయ్‌లో హీరా గ్రూప్‌ వ్యవహారాల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించినట్లు తేలింది. ఇదే కేసులో నౌహీరా సోదరి ముబారక్‌ జాన్‌ షేక్, సోదరుడు షేక్‌ ఇస్మాయిల్, ఇతడి భార్య కమర్‌ జాన్‌ షేక్, నౌహీరా బంధువులు షేక్‌ నఫీనా, షేక్‌ మహ్మద్‌ అష్రఫ్‌లను నిందితులుగా చేరుస్తున్నారు. దీనికి అనుమతి కోరుతూ సీసీఎస్‌ పోలీసులు ఇప్పటికే కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

మిస్టరీగా కొచ్చిన్‌లోని హోటల్‌ వ్యవహారం...
ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది. ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. 12 వేల మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటి వరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న సీసీఎస్‌ పోలీసులు హీరా గ్రూప్‌నకు చెందిన ఆస్తుల వివరాలు సేకరించడంపై దృష్టిపెట్టారు. దీంతో కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను నౌహీరా షేక్‌ రూ.60 కోట్లు వెచ్చించి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హోటల్‌లో ఎలాంటి బుకింగ్స్‌ జరగట్లేదు. దీంతో దాని కార్యకలాపాలు ఆరా తీయాల్సిందిగా కోరుతూ సీసీఎస్‌ పోలీసులు కేరళ అధికారులకు లేఖ రాశారు. 2 రోజుల క్రితం ముంబై వెళ్లిన సీసీఎస్‌ టీమ్‌ అక్కడి అధికారులతో తమ దర్యాప్తు పురోగతిని చర్చించి వచ్చింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top