హవ్వా.. ఆ టీచర్‌కు రాచమర్యాదలా?

Police Support To Molestation Accused Teacher In Prakasam - Sakshi

పోలీసుల అదుపులో ఉన్న  ఉపాధ్యాయుడు బయట ప్రత్యక్షం

సరదాగా ఖాకీలతో కాలక్షేపం

బడ్డీ బంకుల వద్ద కబుర్లు

ప్రకాశం, కందుకూరు అర్బన్‌: చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని ఎక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించే అహంకార మదగజాలకు తానే ఒక అంకుశమంటూ సంఘ వ్యతిరేక శక్తుల భరతం పట్టాడు అంకుశం సినిమాలోని హీరో. పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ఉపాధ్యాయడు 5వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగింక వేధింపులకు పాల్పడ్డాడు. గ్రామస్తులు మొత్తం కలిసి సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేయగా అతడిపై కేసు నమోదు చేసి మూడు రోజుల క్రితం విచారణ పేరుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి అర్ధబలం, అంగబలం, రాజకీయంగా అండదండలు ఉండటంతో పోలీసులు రాచమర్యాదులు చేస్తున్నారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి ఏం అవసరమైనా పోలీసులే సమకూర్చాలని నిబంధనలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా పోలీసులు తీరు ఉండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు..వలేటివారిపాలెం మండలం నేకునాంపురం ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఉన్నం వెంకటేశ్వర్ల లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల వద్ద విద్యార్థిని బంధువులు శనివారం ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులు గడిచినా నిందితుడిని అరెస్టు చేయకుండా విచారణ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తుండటంతో బాధిత కుటుంబం, కాలనీ ప్రజలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ ప్రకాశం నేకునాంపురం పాఠశాల వద్దకు చేరుకొని బాధితుల నుంచి వివరాలు తీసుకున్నారు. న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, ప్రజా సంఘాలు గగ్గోలు పెడుతుంటే పోలీసులు మాత్రం నిందితుడికి రాచమార్యాదలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

పోలీసులే నిందితుడికి అండగా ఉండి  ఆదుపులో ఉన్న వ్యక్తిని టీ బొంకులు వద్ద సరదాగా తిప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు అండగా నిలవడం వెనుక రాజకీయ నాయకులు ప్రయేయం, ఆర్థిక బలం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అదుపులోకి తీసుకొని మూడు రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  గతంలో ఓ కేసులో డీఎస్పీ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఓ దళితుడిని అరెస్టు చేసి 24 గంటలకు గడవకముందే రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో నిందితుడు లైంగిక వేధిపులకు పాల్పడినా  రాజకీయ పార్టీ నాయకులు అండదండలు ఉండటంతో అరెస్టు చేయకుండా కేసు పక్కదారి పట్టిస్తున్నారని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top