బాలుడి అదృశ్యంపై అనుమానాలు

Police Speed Up Baby Missing Case Investigation In Prakasam - Sakshi

50 గంటలు గడిచినా లభ్యం కాని బాలుడి ఆచూకీ

ముమ్మర గాలింపు చర్యల్లో పోలీసులు

సాక్షి, ముండ్లమూరు (ప్రకాశం): మండలంలోని రెడ్డినగర్‌ గ్రామానికి చెందిన రెండేళ్ల మేడగం అరుష్‌రెడ్డి అదృశ్యమై 50 గంటలు గడిచినా ఇంకా ఆచూకీ దొరకలేదు. బాలుడి తండ్రి అశోక్‌రెడ్డి గ్రామంలో చిరు వ్యాపారం చేసుకుంటూ తనకు ఉన్న పొలాన్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అశోక్‌రెడ్డి మృదుస్వభావని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అశోక్‌రెడ్డి తండ్రి వెంకటేశ్వరరెడ్డి ఏడాదిన్నర క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి చిరువ్యాపారం ప్రారంభించాడు. అరుష్‌రెడ్డి తల్లిదండ్రులు మేడగం అశోక్‌రెడ్డి, జ్యోతిలు ఎవరిపై ఎటువంటి అనుమానం లేదని చెప్పడంతో పోలీసులకు ఈ కేసు సవాల్‌గా మారింది. బాలుడి అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సోమవారం సాయంత్రం నుంచి కుమారుడు కనిపించకుండా పోవడంతో ఎవరైనా మాటు వేసి బాలుడిని అపహరించుకెళ్లారా అనే అనుమానం కలుగుతోంది. తెలిసిన వారే కిడ్నాప్‌ చేశారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. గ్రామంతో పరిచయం లేని వారు అయితే అంత తక్కువ సమయంలో బాలుడిని గ్రామం దాటించడం చాలాకష్టంతో కూడిన పని. దీనిని బట్టి గ్రామానికి చెందిన వ్యక్తుల ప్రమేయంతోనే బాలుడు గ్రామం దాటి వెళ్లి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త వ్యక్తి అయితే బాలుడు కేకలు వేస్తాడని, తెలిసన వారే గ్రామం దాటించే అవకాశం ఉందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోపక్క డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా గ్రామం అంతా జల్లెడ పట్టినా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. బాలుడి ఆచూకీ కనుగొనడం పోలీసులకు భారంగా మారింది.

రెడ్డినగర్‌కు చెందిన ఎక్కువ కుటుంబాల వారు కనిగిరి ప్రాంతం నుంచి వలస వచ్చిన వారే. అదృశ్యమైన బాలుడి తల్లి జ్యోతి స్వగ్రామం గుంటూరు జిల్లా నకిరేకల్లు మండలం నర్సింగ్‌పాడు. ఆ గ్రామస్తులు కూడా కనిగిరి ప్రాంతానికి చెందిన వారే కావడంతో రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. బాలుడి తల్లిదండ్రులను బెదిరించేందుకు లేదా వారికి తెలియకుండా ఏమైనా కక్షలు పెంచుకున్న వారు కిడ్నాప్‌నకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు మరోవైపు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే గతంలో మండలంలోని వేముల గ్రామంలో బాలుడు అదృశ్యమైన కేసులో గుంటూరు జిల్లాకు చెందిన వారి ప్రమేయం ఏమైనా ఉందనే చర్చ గ్రామాల్లో జరుగుతోంది. అప్పట్లో చిత్తు కాగితాలు ఏరుకునే వారిని ఆ కేసులో పోలీసులు నిందితులుగా గుర్తించారు. దీని ఆధారంగా పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. అదృశ్యమైన బాలుడు క్షేమంగా ఇంటికి చేరాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top