భార్య.. భర్త, ఓ స్నేహితుడు.. | Polce Nab 3 Thieves In Nellore | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ దొంగల అరెస్ట్‌

Sep 16 2019 8:52 AM | Updated on Sep 16 2019 9:07 AM

Polce Nab 3 Thieves In Nellore - Sakshi

సాక్షి, కావలి (నెల్లూరు): భార్య..భర్త.. ఓ స్నేహితుడు దారి దోపిడీ దొంగలుగా మారి దోపిడీకి పాల్పడ్డారు. తమకు సన్నిహిత పరిచయం ఉన్న ఓ ఆర్‌ఎంపీ ని దోచుకున్న ఈ ముగ్గురి ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌  విలేకరుల సమావేశంలో వివరాలు వివరించారు. పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కందుల రాజేష్, పర్వీన్‌  భార్యాభర్తలు. ఆ ప్రాంతంలో ఆర్‌ఎంపీగా ఉన్న తాళ్లపాళెం రాఘవేంద్రరావుతో పర్వీన్‌ పరిచయం ఏర్పడింది. సన్నిహితంగా ఉంటుండేది. ఆర్‌ఎంపీ ఒంటిపై ధరించిన బంగారు నగలపై పర్వీన్‌ కన్నుపడింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మనం గట్టెక్కడానికి ఆర్‌ఎంపీ ధరించిన బంగారాన్ని ఎలాగైనా కొట్టేయాలని ఆమె భర్తకు చెప్పింది. దీంతో దంపతులతో పాటు రామ్మూర్తిపేటలో నివాసం ఉండే వారి స్నేహితుడు కనమర్లపూడి సాయికుమార్‌తో కలిసి స్కెచ్‌ వేశారు. అందులో భాగంగా పర్వీన్‌ గత నెల 8న పట్టణంలో శుభకార్యానికి వెళ్లాల్సి ఉందని, తన భర్త అందుబాటులో లేడని రాఘవేంద్రరావుకు చెప్పింది. తనను బైక్‌పై శుభకార్యం వరకు తీసుకెళ్లి, మళ్లీ బైక్‌పైనే ఇంటికి తీసుకురావాలని పర్వీన్‌ కోరడంతో రాఘవేంద్రరావు ఆ రోజు రాత్రి 10–11 గంటల సమయంలో శుభకార్యం నుంచి తన బైక్‌పై పర్వీన్‌ను ఎక్కించుకొని వెంగళరావునగర్‌కు వస్తున్నాడు.

మార్గమధ్యంలో కచేరిమిట్ట ప్రాంతంలోని రైల్వే ట్రాక్‌ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు ముసుగులు ధరించి బైక్‌ను అడ్డగించారు. ఆర్‌ఎంపీ పై దాడి చేసి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న బంగారు చైను, రెండు ఉంగరాలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు తాళ్లపాళెం రాఘవేంద్రరావు కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ బీవీవీ సుబ్బారావు, ఎస్సైలు, సిబ్బంది లోతుగా విచారణ జరపడంతో భార్య, భర్త, వారి స్నేహితుడు దోపిడీకి పాల్పడ్డారని గుర్తించారు. నిందితులైన దంపతులు రాజేష్, పర్వీన్, సాయి కుమార్‌ను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి దోపిడీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. లక్ష ఉంటుందని డీఎస్పీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement