పెళ్లి బృందాలకు ప్రమాదాలు

New Couple Injured in Car Accident Visakhapatnam - Sakshi

బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన ప్రమాదం

వధూవరులు క్షేమం

స్వల్పగాయాలతో బయటపడిన బంధువులు

నర్సీపట్నం మున్సిపాలిటీ కృష్ణాపురం వద్దశుక్రవారం రెండు పెళ్లి బృందాలు ప్రమాదానికి గురయ్యాయి. అయితే అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఓ వ్యక్తికి తీవ్రగాయాలుతగలడంతో విశాఖపట్నం తరలించారు.

నర్సీపట్నం: వివాహం చేసుకుని అన్నవరం సత్యదేవుని వ్రతం చేసుకునేందుకు వధూవరులు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొంది. అయితే ఈ ప్రమాదం నుంచి అందరూ క్షేమంగా బయటపడ్డారు. రావికమతం మండలం బుచ్చియ్యపేటకు చెందిన వధూవరులు సీహెచ్‌.రమణ, శ్రీదేవి తమ బంధువులతో కలిసి మొత్తం ఆరుగురు  అన్నవరంలో సత్యదేవుని వ్రతం చేసుకునేందుకు శుక్రవారం తెల్లవారుజామున కారులో బయలు దేరారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం వద్దకు వచ్చేసరికి డ్రై వరు నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు సమీపంలో ఉన్న చెట్టును  ఢీకొంది. ఇదే సమయంలో కారులో ఉన్న సేఫ్టీ బెలూన్లు  తెరుచుకోవడంతో ముందు కూర్చున్న వ్యక్తులకు పెను ప్రమాదం తప్పింది.  ఈ ఘటనలో వధూవరులతో పాటు ఆరుగురికి స్వల్పగాయాలు కావడంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వచ్చి బా«ధితులకు సాయమందించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  

మినీ బస్సు బోల్తా
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ కృష్ణాపురం వద్ద శుక్రవారం ఓ మినీ బస్సు బోల్తా పడడంతో 11 మంది గాయపడ్డారు.  వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.  మున్సిపాలిటీలోని బలిఘట్టానికి  చెందిన గవిరెడ్డి హరికృష్ణకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన సుస్మితతో శుక్రవారం వివాహం చేసేందుకు నిశ్చయించుకున్నారు. దీనిలో భాగంగా సుస్మితతో వారి బంధువులు మొత్తం పన్నెండు మంది ఉదయం బలిఘట్టం చేరేందుకు గురువారం రాత్రి అవనిగడ్డ నుంచి మినీ బస్సులో బయలుదేరారు.  వివాహ వేదికకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం వద్దకు చేరుకునేసరికి  డ్రైవర్‌ నిద్రలోకి జారుకోవడంతో ఎదురుగా ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాపడింది.  అయితే ఈ స్తంభం ఇటీవల కొత్తగా వేస్తున్న విద్యుత్‌ లైనుది కావడంతో విద్యుత్‌  సరఫరా లేక పెను ప్రమాదం తప్పింది.  ఈ ప్రమాదంలో డ్రైవరుతో పాటు మిగిలిన పదకొండు మందికి స్వల్పగాయాలయ్యాయి.  వీరిని  స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి ఇళ్లకు తరలించారు. డ్రైవర్‌ గంగరాజు ఆస్పత్రిలో చికిత్స పొదుతున్నాడు.  రామ్మూర్తి మాష్టారు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు తగలడంతో  విశాఖకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top