ఎక్కడ?

mystery on bangalore it engineer Disappear case - Sakshi

టెక్కీ అజితబ్‌ మిస్సింగ్‌ మిస్టరీ

ఆచూకీ కోసం బంధుమిత్రుల ఆరాటం

సోషల్‌ మీడియాలో ప్రచారం

బెంగళూరు, వైట్‌ఫీల్డ్‌: బెంగళూరు బెళ్ళందూరులోని ఒక ప్రైవేటు కంపెనీలో ఐటీ ఇంజినీరుగా పనిచేస్తున్న పాట్నాకు చెందిన అజితబ్‌ (29) అదృశ్యం కేసు పదిరోజులు దాటినా  మిస్టరీగానే ఉంది. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, మిత్రులు ఆన్‌లైన్‌లో ప్రచారాన్ని చేపట్టారు. తన కారును విక్రయించేందుకు ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన చేసిన అజితబ్‌ ఎవరో దానిని కొనడానికి ఫోన్‌ చేయగా, కారు తీసుకొని వెళ్లాడు. అప్పటి నుంచి ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు. ఈ నెల 18న ఘటన జరిగింది. అతని రూమ్‌మేట్‌ యిచ్చిన సమాచారం మేరకు టెక్కీ తమ్ముడు ఆర్ణబ్‌కుమార్‌ ఫిర్యాదు చేయగా వైట్‌ఫీల్డ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతవరకు అతని జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

అజితబ్‌ ఆచూకీ తెలపాలని సోషల్‌ మీడియాలో ప్రకటనలు, వీడియోలతో ప్రచారం చేస్తున్నారు. అజితబ్‌ తండ్రి అశోక్‌ కుమార్‌ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తన బిడ్డ ఎవరికీ హాని చేయలేదని అమాయకుడని అన్నారు. తన బిడ్డను వదలివేయాలని విజ్ఞప్తి చేస్తున్న వీడియోను కూడా ఆన్‌లైన్‌లో ఉంచారు. త్వరలో పెళ్లికి విషయమై కొద్దిరోజుల కిందటే తనతో మాట్లాడాడని, బెంగళూరు అంటే ప్రశాంతతకు మారుపేరని అనుకున్నామని చెప్పారు. అతని అదృశ్యం అంతుచిక్కనిదిగా మారడంతో అతని కోసం పోలీసులు ఒకవైపు, మరోవైపు అతని కుటుంబ సభ్యులు, మిత్రులు వెదుకుతున్నారు. కారు కొంటామని కాల్‌ చేసినవారే ఏదైనా చేసి ఉంటారనే ప్రచారం సాగుతోంది. కార్‌ కొనుగోలుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 18వ తేదీ సాయంత్రం 7:30 సమయంలో చివరిసారిగా అతని ఫోన్‌ వైట్‌ఫీల్డ్‌ పరిధిలోని గంజూరులో పనిచేసింది. ఆ తరువాత నుంచి స్విచ్ఛాఫ్‌ అయ్యింది.

ఎంబీఏ చదవడానికి కారు అమ్ముదామని..
మణిపాల్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌ చేసిన అజితబ్‌ ఉన్నత చదువుల కోసం తపించేవాడు. వచ్చే ఏడాది కోల్‌కతా ఐఐఎంలో ఎంబీఏ చేయాలనే లక్ష్యంతో డబ్బు సమకూర్చుకోవడానికి తన కారును విక్రయించాలని నిర్ణయించాడు. ఈ నెల 20వ తేదీ లోగా మొదటి వాయిదా కింద ఆ డబ్బు కట్టాల్సి ఉంది. అందుకే కొత్తగా కొన్నప్పటికీ ఎంతో ఒకంతకు అమ్మేసి బంగారు భవితను నిర్మించుకోవాలని అతను కలలుగన్నాడు. అయితే విధి ఏం తలచిందోగానీ అదే విషయంలో ఎక్కడో భారీ తప్పిదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడ అనుమానాస్పద కారు, ఇతరత్రా లభ్యమైనట్లు తమకు సమాచారం అందలేదని వైట్‌ఫీల్డ్‌ డీసీపీ అబ్దుల్‌ అహద్‌ చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top