వారికిది ‘డబ్బుల్‌’ పథకం!

Money scheme! - Sakshi

ఇళ్ల బిల్లులు రావాలంటే లంచం కక్కాల్సిందేనట

ఇటీవల ఏసీబీకి చిక్కిన ముగ్గురిదీ ఇదే కోవ

సాక్షి, కొత్తగూడెం : పేదల కోసం ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్‌ బెడ్రూం పథకాన్ని కొందరు అధికారులు, సిబ్బంది ‘డబ్బులు’ కక్కే పథకంగా మలుచుకుంటున్నారు. అందిన కాడికి లంచాలు పుచ్చుకునేలా అవకాశాలను మార్చుకుంటున్నారు. సర్కారు కేటాయిస్తున్న నిధులతో డబుల్‌ బెడ్రూం ఇళ్లు కడితే..తమకు మిగిలేది నామమాత్రమేనని, ఇందులో పర్సంటేజీలు ఇచ్చుకుంటూ పోతే..ఇక తాము నష్టపోవాల్సిందేనని కాంట్రాక్టర్లు వాపోతూ..అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తుండడంతో జిల్లాలో ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో..ఈ పథకం వెనకాల నడుస్తున్న   అవినీతి బాగోతం వెలుగుజూసింది.

డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గిట్టుబాటు కావట్లేదనే ఆలోచనతో కాంట్రాక్టర్లు మొదట్లో ముందుకు రాలేదు. అయినప్పటికీ ఉన్నతాధికారుల కృషి ఫలితంగా కొందరు నిర్మాణాలు చేపట్టారు. చివరకు ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలోనూ ఇంజినీరింగ్‌ అధికారులు భారీగా ముడుపులు అడుగుతున్నారని అనేక ఆరోపణలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఐటీడీఏలో ఇద్దరు.. 

భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణ డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌ వద్ద రూ.50వేలు లంచం తీసుకుని ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని జయశంకర్‌ జిల్లా వెంకటాపురం మండలంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో బిల్లులు ఇవ్వకుండా తిప్పుతుండడంతో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్‌ శ్రీనివాసరెడ్డి విసుగు చెందారు.

తనకు రూ.55లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండగా..పర్సంటేజీ రూ.లక్ష ఇవ్వాలని ఏటీడీఏ విభాగం నుంచి డిమాండ్‌ చేయడంతో..విసుగుచెందిన కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించి వారి సూచన మేరకు..ముందుగా రూ.50వేలు ఇస్తానని అంగీకరించి ఓ చోట ఇస్తుండగా..ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐటీడీఏ ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణను అరెస్ట్‌ చేశారు. 

గతంలో బూర్గంపాడు డీటీ.. 

డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రతీది తమకు కాసులు కురిపించేలా చేసుకుంటున్నారు కొందరు అధికారులు అనడానికి..బూర్గంపాడులో గతంలో జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. గత అక్టోబరులో బూర్గంపాడు మండలంలో డబుల్‌ ఇళ్లకు ఇసుక కూపన్లు ఇచ్చేందుకు అప్పటి ఉప తహసీల్దార్‌ భరణిబాబు కాంట్రాక్టర్‌ వద్ద రూ.20వేలు డిమాండ్‌ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించడంతో..రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. డబుల్‌ బెడ్‌రూం లాంటి పథకాల విషయంలోనూ అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తుండడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది.

 విద్యాశాఖలో ఒకరు.. 

గత జనవరి 29వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు. పాల్వంచకు చెందిన శ్రీలక్ష్మి చిల్డ్రన్స్‌ స్కూల్‌కు రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తి కావడంతో మరో రెండు సంవత్సరాలు రెన్యువల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా..డీఈఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ కట్టంగూరు సైదులు రూ.25వేలు డిమాండ్‌ చేశాడు. 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న తాము అంత ఇవ్వలేమని చెప్పినప్పటికీ వినకపోవడంతో పాఠశాల యజమాని ఏసీబీని ఆశ్రయించారు.

జనవరి 29న సదరు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.25వేలు తీసుకుంటూ సైదులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ విషయానికి వస్తే మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, కస్తూర్బా పాఠశాలల బిల్లులు, ప్రైవేట్‌ పాఠశాలల విషయంలో ముడుపులు ఇవ్వనిదే పనులు అయ్యే పరిస్థితి లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top