‘ఎల్లం’ రాక కోసం..    

Man Died In Gulf - Sakshi

అనారోగ్యంతో సౌదీలో దుబ్బాక వాసి మృతి

డ్రైవర్‌గా పని చేస్తూ అస్వస్థతకు గురై..

కన్నీరుమున్నీరైన  కుటుంబ సభ్యులు

మృతదేహం కోసం ఎదురుచూపులు

దుబ్బాకటౌన్‌ : అసలే నిరుపేద కుటుం బం.. దీంతో పుట్టి పెరిగిన ఊళ్లో పని లేక.. కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్యపిల్లలను వదిలి గల్ఫ్‌ దేశం వెళ్లిన దుబ్బాకకు చెందిన చింతకింది ఎల్లం(50) తీవ్ర అస్వస్థతకు గురై ఈనెల 14న అక్కడే మృతిచెందారు. 17 సంవత్సరాలుగా సౌదీలో పనిచేస్తున్న ఆయన 8 నెలల కిత్రం స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. ఇదిలా ఉండగా, ఎల్లం సౌదీలోని ఓ కంపెనీలో గతంలో జేసీబీ డ్రైవర్‌గా.. ప్రస్తుతం కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

ఈక్రమంలో 5 రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై కింద పడిపోయారు. దీంతో కంపెనీ యజమాని, తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఎల్లం తలలో రక్తం గడ్డకట్టి స్పృహ తప్పిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10 గంటల(ఆగష్టు 14)కు ఎల్లం మృతిచెందారు. దీంతో సౌదీలోనే మరో చోట పనిచేస్తున్న ఎల్లం కుమారుడు నర్సింలుకు సమాచారం అందించడంతో ఆయన అక్కడకు చేరుకొని.. దుబ్బాకలో ఉంటున్న కుటుంబ సభ్యులకు విషయం చేరవేశాడు.

మంచిగానే ఉన్నాడనుకున్నాం..

సౌదీలో ఎల్లం చనిపోయాడన్న వార్త తెలియడంతో దుబ్బాకలో ఉన్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. మంగళవారం ఉదయం వీడియోకాల్‌లో మాట్లాడామని.. అప్పుడు మంచిగానే ఉన్నానని ఎల్లం చెప్పాడని.. ఇంతలోనే మృతిచెందాడన్న వార్త వచ్చిందని కంటతడి పెట్టారు. ఇదిలా ఉండగా, ఎల్లం మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎల్లం మృతి వార్త తెలుసుకొని ఆయన కుటుంబాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డితో పాటు నాయకులు ఓదార్చారు. ఎల్లంకు భార్యలు విజయ, ఎల్లవ్వతో పాటు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

10 వేల రియల్స్‌ అవసరం

మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలంటే 10 వేల రియల్స్‌ ఖర్చు అవుతుందని సౌదీ అధికారులు చెప్పారని ఎల్లం కుమారుడు నర్సిలు తెలిపారు. తన తండ్రి పని చేసిన కంపెనీ యజమానిని అడిగితే అంత డబ్బు లేదని చెప్పాడని నర్సింలు ఫోన్‌లో ‘సాక్షి’కి వివరించారు. ఇండియన్‌ ఎంబసీ అధికారులను ఈ విషయమై కలుస్తానని చెప్పారు. 

మృతదేహం తీసుకొచ్చేందుకు చర్యలు

సౌదీలో మరణించిన ఎల్లం మృతదేహాన్ని దుబ్బాకకు తెప్పించేందకు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడి.. వెంటనే చర్యలు తీసుకుంటానని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎల్లం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లి.. అక్కడే మృతిచెందడం బాధాకరమన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top