
అమరావతి(పెదకూరపాడు) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తను శుక్రవారం గుంటూరు జిల్లా అమరావతి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం అమరావతిలోని గోపాల్‌నగర్‌కు చెందిన పెద్దిబోయిన వెంకట శివరావు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పని చేశాడు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో మార్చి 12వ తేదీన రవిచౌదరి అనే వ్యక్తి పోస్టు చేసిన, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా ఉన్న పోస్టును ఈ నెల ఒకటో తేదీన ఫేస్‌బుక్‌లో తన స్నేహితులకు, పబ్లిక్‌కు వెంకట శివరావు షేర్ చేశాడు. దీనిపై వైఎస్సార్ సీపీ కార్యకర్త బైనబోయిన సురేష్ తుళ్ళూరు డీఎస్పీ కేశప్పకు ఫిర్యాదు చేశారు. అమరావతి సీఐ శివనాగరాజు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం సత్తెనపల్లి కోర్టుకు తరలించారు.