గుప్త నిధుల పేరుతో మోసం

Man Arrested By Police Over Cryptocurrency Fraud In Prakasam - Sakshi

వ్యక్తి అరెస్ట్‌, నిందితుడి నుంచి రూ. 2.20 లక్షలు స్వాధీనం 

సాక్షి, మార్కాపురం:  గుప్త నిధుల పేరుతో మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన తన్నీరు శివయ్య పెద్దారవీడు మండలం కలనూతల గ్రామానికి చెందిన గోదా నడిపి అనే వ్యక్తి వద్ద గుప్తు నిధుల సమాచారం చెబుతానని రూ. 1.50 లక్షలు, ఒంగోలుకు చెందిన మాదాల శ్రీదేవి వద్ద రూ. 3.50 లక్షలు, బేస్తవారిపేటకు చెందిన నాగరాజు వద్ద రూ. 2.50 లక్షలు తీసుకున్నారు. వాటితో ఒక కారు కొనుగోలు చేసి ప్రజలను గుప్త నిధుల పేరుతో మోసం చేస్తున్నాడని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్దారవీడు పోలీసులు గోదా నడిపి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తుండగా కుంట జంక్షన్‌ వద్ద నిందితుడిని అరెస్ట్‌ చేసి రూ. 2.20 లక్షల నగదును, నంబర్‌ లేని మహీంద్రా కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజలు మాయమాటలు నమ్మి మోసపోవద్దని డీఎస్పీ తెలిపారు. 

బంగారం పేరుతో..
అమాయక ప్రజలను బంగారం పేరుతో మభ్యపెట్టి మోసం చేసిన వ్యక్తిని మంగళవారం పట్టణ సమీపంలోని బోడపాడు అడ్డరోడ్డు వద్ద పట్టణ ఎస్సై టి.కిశోర్‌బాబు అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపారు. ప్రజల వద్ద నుంచి డబ్బులు తీసుకుని నకిలీ బంగారం ఇచ్చి మోసం చేస్తున్న చీమకుర్తి మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన నాగులూరి ప్రకాశం, దోర్నాల మండలంలోని రామచంద్రకోట గ్రామానికి చెందిన కర్రా సుబ్బరాయుడుకు బంగారు చైను ఇస్తానని 55 వేల రూపాయలు తీసుకుని చైను ఇచ్చాడన్నారు. దీనిని సుబ్బరాయుడు బంగారు దుకాణంలో తనిఖీ చేయించగా నకిలీదని తేలటంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా బోడపాడు అడ్డరోడ్డు వద్ద ప్రకాశం ఆటోలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేసి అతని వద్ద నుంచి రూ. 50 వేల నగదు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసిన ఎస్సైలు రామకృష్ణ, కిశోర్‌బాబులను దర్యాప్తు చేసిన సీఐ కేవీ రాఘవేంద్రను డీఎస్పీ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top