ఆటకు రూ.500!

Man Arrest Running Cards Club in Hyderabad - Sakshi

కమీషన్‌ తీసుకుంటూ పేకాట శిబిరం నిర్వహణ

సమాచారంతో దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

నిర్వాహకుడితో పాటు 14 మందికి అరదండాలు

సాక్షి, సిటీబ్యూరో:  తన కార్యాలయాన్నే పేకాట శిబిరంగా మార్చేసిన ఓ ప్రబుద్ధుడు పరిచయస్తుల్ని ఆహ్వానించి మూడు ముక్కలాట ఆడిస్తున్నాడు. ఒక్కో ఆటకు రూ.500 చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నాడు. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి దాడి చేశారు. నిర్వాహకుడితో సహా 14 మందిని పట్టుకున్న అధికారులు వీరి నుంచి రూ.47 వేల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. దోమలగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ లతీఫ్‌ ఖాన్‌ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని సోలార్‌ విజన్‌ పేరుతో సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇలా వచ్చే ఆదాయంతో తృప్తి పడని ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించాలని భావించాడు. ప్రభుత్వం పేకాట క్లబ్బుల్ని నిషేధించడంతో పేకాటరాయుళ్ళ కోసం తన కార్యాలయాన్నే శిబిరంగా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. పరిచయస్తులు, స్నేహితుల్ని ఆహ్వానిస్తూ ఆ కార్యాలయంలో మూడు ముక్కలాట ఆడించడం మొదలెట్టారు.

ఒక్కో గేమ్‌కు రూ.500 చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నాడు. ఇతడి వద్దకు వచ్చి పేకాట ఆడుతున్న వారంతా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతులకు చెందిన వారే. గడిచిన కొన్నాళ్ళుగా గట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారంపై శనివారం రాత్రి మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు కె.శ్రీనివాసులు, టి.శ్రీధర్‌ తమ బృందాలతో ఆ కార్యాలయంపై దాడి చేశారు. అక్కడే ఉన్న నిర్వాహకుడు లతీఫ్‌ ఖాన్‌తో పాటు మూడు ముక్కలాట ఆడుతున్న మహ్మద్‌ ఫైజల్‌ (కూలీ), సాదిఖ్‌ అలీ (కార్పెంటర్‌), మిరాజుద్దీన్‌ (ఎలక్ట్రీషియన్‌), మహ్మద్‌ ఇస్మాయిల్‌ (కూలీ), కె.సతీష్‌ (సేల్స్‌మెన్‌), జి.సురేష్‌ (మొబైల్‌ టెక్నీషియన్‌), సీహెచ్‌ శేఖర్‌ (ఆటోడ్రైవర్‌), కె.కృష్ణ (ప్రైవేట్‌ ఉద్యోగి), మహ్మద్‌ ఫక్రుద్దీన్‌ అహ్మద్‌ (స్క్రాప్‌ వ్యాపారి), జబీర్‌ హుస్సేన్‌ (స్క్రాప్‌ వ్యాపారి), మహ్మద్‌ హుస్సేన్‌ (స్క్రాప్‌ వ్యాపారి), మహ్మద్‌ అక్బర్‌ ఖాన్‌ (డ్రైవర్‌), యాకూబ్‌ అలీలను (స్క్రాప్‌ వ్యాపారి) అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, 16 సెల్‌ఫోన్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుల్ని చిక్కడపల్లి పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top