22 ఏళ్ల తర్వాత హత్య కేసులో నిందితుడి అరెస్టు

Man Arrest in Murder Case After 22 Yeats - Sakshi

 బెంగళూరులో పట్టుబడ్డాడు

చిత్తూరు ,కురబలకోట/మదనపల్లె : హత్య  కేసులో 22 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసిన సంఘటన కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. మంగళవారం ముదివేడు ఎస్‌ఐ నెట్టి కంఠయ్య తెలిపిన వివరాలు.. ముదివేడుకు చెందిన అమీర్‌ఖాన్‌ 1997 అక్టోబర్‌ 7న తన పొలం వద్ద హత్య కు గురయ్యారు. ముదివేడు ప్రాంతానికి చెందిన సత్తార్‌ఖాన్, ఇంతియాజ్‌Œ ఖాన్, ఇలియాజ్‌ఖాన్, బి.కొత్తకోటకు చెందిన టైలర్‌ మొహిద్దీన్‌ఖాన్‌ ఇతన్ని భూతగాదాల నేపథ్యంలో గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. వీరిలో మొహిద్దీన్‌ తప్ప ముగ్గురిని అరెస్టు చేశారు. అంతేగాకుండా 2000 ఫిబ్రవరి 4న మదనపల్లె 1వ ఏడీజే కోర్టు వీరికి జీవిత ఖైదు, జరిమానా విధించింది. వీరు జైలు శిక్ష కూడా పూర్తి చేసుకుని విడుదలయ్యారు. 4వ ముద్దాయి అయిన  టైలర్‌ మొహిద్దీన్‌ ఖాన్‌ అలియాస్‌ బుజ్జీ మాత్రం 22 ఏళ్లుగా పరారీలో ఉండడంతో మదనపల్లె కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు అప్పట్లోనే జారీ చేసింది.

ఈ క్రమంలో జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పెండింగ్‌ కేసులు, నాన్‌ బెయిలబుల్‌ కేసుల నిందితులను అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. డీఎస్పీ చిదానందరెడ్డి పర్యవేక్షణలో రూరల్‌ సీఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ముదివేడు ఎస్‌ఐతోపాటు హెడ్‌ కానిస్టేబుల్‌ శివరామకృష్ణయ్య, కానిస్టేబుళ్లు రాఘవేంద్రరెడ్డి, శ్రీనివాసులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. టైలర్‌ మొహిద్దీన్‌ఖాన్‌పై దృష్టి సారించారు. మూడు నెలల క్రితం ఇతని అక్క చనిపోయింది. అతను వస్తాడని వల పన్నారు. ఇది పసికట్టిన అతను రాలేదు. అతని సెల్‌ నంబర్‌ సేకరించి సాంకేతికత పరిజ్ఞానంతో పోలీసులు అతడి కదలికలు పసిగట్టారు. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులో ఇతన్ని అరెస్టు చేశారు. ఇతను హత్యానంతరం విజయవాడ, బెంగళూరు, ముంబైలో గడిపాడని, ఇప్పుడు బెంగళూరులో టైలర్‌గా ఉంటూ నేర ప్రవృత్తిని దాచి వివాహం కూడా చేసుకున్నట్లు తేలింది. నిందితుడి అరెస్టులో కృషి చేసిన ప్రత్యేక బృందాన్ని డీఎస్పీతో పాటు ఉన్నతాధికారులు అభినందించారు. అలాగే, పెండిం గ్‌ కేసుల్లో భాగంగా నాన్‌ బెయిలబుల్‌ వారెం టున్న 16 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top