సీసీఎస్‌లో లాకప్‌డెత్‌ కలకలం..?

Lockup Death In CPS Visakhapatnam - Sakshi

స్పందించని నగర పోలీస్‌ అధికారులు

మృతుడు విజయనగరం జిల్లా వాసి

అల్లిపురం(విశాఖ దక్షిణం): విశాఖ నగరంలోని సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో మంగళవారం లాకప్‌ డెత్‌ జరిగినట్లు కలకలం రేగింది. విశ్వసనీయ సమాచారం మేరకు... విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు గొర్లి పైడిరాజు (26)ను సీసీఎస్‌ పోలీసులు విచారణ నిమిత్తం తీసుకొచ్చినట్లు తెలిసింది. మంగళవారం అతడిని విచారిస్తున్న సమయంలో మృతి చెందినట్లుగా సమాచారం. తక్షణమే పోలీసులు మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారని, ఈ విషయం నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌చంద్ర లడ్డాకు తెలియడంతో సీసీఎస్‌ ఏసీపీ వై.గోవిందరావును తన చాంబర్‌కు పిలిపించి హెచ్చరించినట్లు సమాచారం.

సీసీఎస్‌ వద్ద హైడ్రామా
విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు సెంట్రల్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న ఏసీపీ గోవిందరావు ఎందుకు వచ్చారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు అడిగిన దానికి సమాధానం దాటవేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నారు. తరువాత సీసీఎస్‌లో ఉన్నవారు ఒకరొకరు వెళ్లిపోవడంతో స్టేషన్‌ నిర్మానుష్యంగా మారింది.
6 గంటల తర్వాత మృతదేహం మార్చురీకిఅనుమానాస్పదంగా మృతి చెందిన గొర్లి పైడిరాజు మృతదేహాన్ని పోలీసులు మంగళవారం మధ్యాహ్నమే సీసీఎస్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి రహస్యంగా తరలించారు. కానీ రాత్రి 8.45 గంటల సమయంలో మృతదేహాన్ని మార్చురీకి తరలించటం విశేషం. ఈ ఆరు గంటల పాటు మృతదేహాన్ని పోలీసులు ఎక్కడ తిప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు విషయాన్ని బయటకు పొక్కకుండా చూద్దామని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మరో పక్క మృతుడు గుండెపోటుతో చనిపోయాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మృతుడిపై ఆరు కేసులు
మృతుడు గొర్లె పైడిరాజుపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు నిందితుడిని సీసీఎస్‌ పోలీస్‌లు విచారణ నిమిత్తం తీసుకొచ్చారు. అతని సహ నిందితుడు దున్నా కృష్ణ సమాచారం కోసం విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గొర్లె పైడిరాజు మృతి చెందినట్లు సమాచారం.

విచారణ జరుపుతున్నాం
సంఘటపై విచారణ జరుపుతున్నాం. మృతుడు గొర్లె పైడిరాజును విచారణ నిమిత్తం తీసుకొచ్చాం. సోమవారం రాత్రి అతని భార్య వచ్చి తీసుకెళ్లిపోయింది. కానీ ఏం జరిగిందో పూర్తి విచారణ చేపట్టమని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా ఆదేశించారు. ఈ మేరకు ప్రస్తుతం విచారణ జరుపుతున్నాం. పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం. – దాడి నాగేంద్రకుమార్, జాయింట్‌ పోలీస్‌ కమిషనర్, విశాఖపట్నం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top