'జడ్జీగారు ప్లీజ్‌.. నన్ను ఆ జైలులో పెట్టొద్దు'

Lalu Yadav Doesnt Want To Go To An Open Jail - Sakshi

సాక్షి, రాంచీ : 'సర్‌, దయచేసి ఒకసారి ఓపెన్‌ జైలు నియమనిబంధనలు చూడండి.. 60 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లకు పైగా శిక్ష పడినవారు, మావోయిస్టులకు మాత్రమే ఓపెన్‌ జైలు. పైగా శిక్ష పడిన వ్యక్తి ఇష్టం లేకుండా మీరు ఆ జైలులో  పెట్టడం సరికాదు' అంటూ బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ న్యాయమూర్తి శివపాల్‌ సింగ్‌ను విజ్ఞప్తి చేశారు. దాణా కుంభకోణం కేసులో లాలూకు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ఓపెన్‌ జైలులో లాలూ శిక్షను పూర్తి చేయాలని తీర్పు సమయంలో న్యాయమూర్తి చెప్పారు. దీని ప్రకారం ఆయన హజరీబాగ్‌లోని ఓపెన్‌ జైలుకు వెళ్లాలి. అక్కడ ఓ వంద కాటేజీలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి అందులో ఉండొచ్చు. పైగా ఏదైనా పనిచేసుకుంటూ, ఏదేని ఓ కళకు సంబంధించిన శిక్షణను కూడా పొందొచ్చు. 2013లో ఈ జైలును ప్రారంభించారు. మావోయిస్టులు, నేర విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు, లొంగిపోయినవారు తదితరులను ఆ జైలులో పెడుతుంటారు. లాలూను కూడా అదే జైలులో ఉండాలని న్యాయమూర్తి చెప్పగానే ఆయన నిరాకరించారు. అది మావోయిస్టుల కోసం ఉన్న జైలు అన్నారు. తన ఇబ్బందులు తనకు ఉంటాయని తెలిపారు. అయితే, గతంలో బిర్సా ముండా జైలుకు వెళ్లినప్పుడు లాలూ నిబంధనలు అతిక్రమించి వ్యవహరించినట్లు స్పష్టమైంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top