
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ర్యాన్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్య కేసు మరో మలుపు తిరిగింది. అతడిని హత్య చేసిన 11వ తరగతి విద్యార్థిని వయోజనుడిగానే పరిగణించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. అతడు తప్పనిసరిగా ఇతర ఖైదీల మాదిరిగానే కోర్టుకు తీసుకురావచ్చని స్పష్టం చేసింది. శుక్రవారం అతడిని కోర్టు తీసుకురావాలని, ఆ రోజు నేరం చేసినట్లు రుజువైతే అతడికి 21 ఏళ్లు నిండే వరకు బాల నేరస్తుల గృహంలో ఉంచి ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు. గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పాఠశాల బస్ కండక్టర్ ఈ హత్య చేసినట్లు తొలుత భావించినా అతడిని దోషిగా చేసేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ తెలిపింది.
అనంతరం చేసిన దర్యాప్తులో ప్రద్యుమ్నను హత్య చేశాడనే ఆరోపణలపై అదే స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేసినట్లు గుర్తించాడు. రెండోక్లాసు చదివే ప్రద్యుమ్నను సెప్టెంబరు 8న పాఠశాల వాష్‌రూంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో మొదట పాఠశాల బస్ కండక్టర్ అశోక్‌ను అరెస్టు చేశారు. కాగా, సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్‌గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని ఆ సమయంలో చెప్పగా వారి విజ్ఞప్తి మేరకు అతడిని యుక్తవయస్కుడిగానే గుర్తించి విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.