శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో కలకలం | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలో కలకలం

Published Fri, Nov 30 2018 1:02 PM

IIIT Student Commits Suicide Attempt in Srikakulam - Sakshi

కృష్ణాజిల్లా , నూజివీడు :  శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని బోడ సుష్మాపావని (18) ఆత్మహత్యాయత్నం ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో కలకలం రేపింది. సాఫీగా సాగుతున్న విద్యాసంస్థలో ఆత్మహత్యాయత్నం జరగడంతో ఒక్కసారిగా సంచలనం కలిగించింది. బోడ సుష్మాపావని స్వగ్రామం వరంగల్‌ జిల్లా గూడూరు మండలం గుండెంగ కాగా, తండ్రి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తాడని ట్రిపుల్‌ఐటీ సిబ్బంది పేర్కొన్నారు. ఒకవైపు సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతుండగా వాటిని రాస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించిందో అంతుబట్టడం లేదు. అర్ధరాత్రి దాటిన తరువాత 2.30 గంటల ప్రాంతంలో కే4 హాస్టల్‌ భవనంలో రెండో అంతస్తు నుంచి హాస్టల్‌ వెలుపల వైపునకు దూకడం వెనుక బలమైన కారణాలు ఏమిటనేది ఇంకా బయటపడలేదు. తల, ఇతర చోట్ల దెబ్బలు తగలకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని అధికారులు అంటున్నారు. ఇదిలాఉండగా సదరు విద్యార్థిని గత శనివారం మూడో అంతస్తులో ఉన్న తన రూం నుంచి రెండో అంతస్తులో ఉన్న 45వ నంబరు రూంలోకి వచ్చి ఉంటోందని విద్యార్థినులు చెబుతున్న సమాచారం. విద్యార్థిని రూం మారినప్పటికీ కేర్‌ టేకర్లు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తే ట్రిపుల్‌ఐటీ అధికారుల వద్ద సరైన సమాచారం లభించడం లేదు.

పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు..
ఒక వైపు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసు అధికారులు   ఆత్మహత్యాయత్నమేనని స్పష్టం చేస్తుండగా, ట్రిపుల్‌ఐటీ అధికారులు మాత్రం కాలు జారి పడిపోయినట్లుగా ప్రచారం చేస్తూ పక్కదారి పట్టించడానికి ప్రయత్నించడం గమనార్హం. వాష్‌రూంకు వెళ్లేందుకు లేచిన విద్యార్థిని ఉమ్ము ఊసేందుకు పక్కకు వంగగా జారి పడిపోయానని క్షతగాత్రురాలు చెప్పిందంటూ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ బాలికకు మూడో అంతస్తులోని రూం నంబరు 47ను కేటాయించగా, గత శనివారం నుంచి రెండో అంతస్తులోని రూంనెంబరు 45లో ఉంటోంది. ఈ రూంలో ఉంటున్న పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులు మాకు ఇబ్బందిగా ఉంటోందని కేర్‌ టేకర్లకు చెప్పినా పట్టించుకోలేదని సమాచారం. పరీక్షల వరకే కదా ఉండేది, ఆ తరువాత సెలవులు ఇస్తారు కాబట్టి ఇంటికి వెళ్లిపోతానని వారితో అన్నట్లు ఆ విద్యార్థులు చెప్తున్నారు. అసలు ఆమెకు కేటాయించిన గదిలో ఉండకుండా క్లాసుమేట్స్‌ కూడా కానటువంటి, అక్టోబర్‌లో నూతనంగా చేరిన పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల గదిలో ఎందుకు ఉంటుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా సరైన విచారణ జరిపి కారణాలను వెలికితీయకపోతే ఆత్మహత్యాయత్నానికి దారితీసిన కారణాలు మిస్టరీగానే మిగలనున్నాయి.

Advertisement
Advertisement