15 కేసులు.. అయినా మారని తీరు

Hukka Center Owner Arrest in Hyderabad - Sakshi

పదే పదే హుక్కా అమ్ముతున్న నిందితుడు

బంజారాహిల్స్‌: ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 15 కేసులు... ఇప్పటి వరకు 10 సార్లు జైలుకు..15 సార్లు న్యాయస్థానానికి.. అయినా సరే ప్రవర్తనలో మార్పు లేకపోగా అదే తప్పును పదేపదే చేస్తున్న నిందితుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు గురువారం మరోసారి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లో నివసించే మహ్మద్‌ జీషన్‌ అహ్మద్‌(32) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం:1/9లో  హైదరాబాద్‌ టైమ్స్‌ కేఫ్‌(హెచ్‌టీసీ) పేరుతో హుక్కా సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. 2016లో ప్రారంభమైన ఈ హుక్కా సెంటర్‌ను తరచూ పోలీసులు దాడులు చేసి సామగ్రిని సీజ్‌ చేసి నిర్వాహకుడు జీషన్‌ అహ్మద్‌పై కేసులు నమోదు చేస్తూ కోర్టులో హాజరుపరుస్తూ జైలుకు పంపిస్తున్నా బెయిల్‌పై రాగానే మళ్లీ హుక్కా సెంటర్‌ నడిపిస్తున్నాడు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి ఫర్నిచర్‌తో సహా సీజ్‌ చేసినా సరే వినిపించుకోకుండా కొత్త ఫర్నిచర్‌ కొనుగోలు చేసి అదే దందాను కొనసాగిస్తున్నాడు. ఎన్ని సార్లు జైలుకి వెళ్లినా తీరు మార్చుకోకుండా పగలు, అర్థరాత్రి అనే తేడా లేకుండా తనకు తెలిసిన కస్టమర్లను పిలిపించుకుంటూ హుక్కా సరఫరా చేస్తు న్నాడు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 15 కేసులు అతనిపై నమోదయ్యాయి.

ఎంత చెప్పినా వినిపించుకోకుండా హుక్కా దందా కొనసాగిస్తుండగా పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇటీవల కాలంలో చుట్టూ తలుపులకు తాళాలు వేసి లోపల లైట్లు బంద్‌ చేసి చీకటి వ్యాపారం కొనసాగిస్తూ మైనర్లకు హుక్కా సరఫరా చేస్తున్నాడు. ఒకవైపు టాస్క్‌ఫోర్సు పోలీసులు ఇంకో వైపు జూబ్లీహిల్స్‌పోలీసులు పక్కా నిఘా వేసి దాడులు చేసేందుకు యత్నిస్తుంటే దొరక్కుండా తప్పించుకుంటున్నాడు. తాజాగా బుధవారం సాయంత్రం పోలీసుల కళ్లుగప్పి మరోసారి మైనర్లకు హుక్కా సరఫరా చేస్తూ ఎట్టకేలకు చిక్కాడు. ఏడాది క్రితం నిందితుడ్ని న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారని తాము తీసుకొస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడని సాయంత్రంలోపు నిందితుడ్ని పట్టుకుని జైలుకు తరలించామని పోలీ సులు ఘటనను గుర్తుచేసుకున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ హుక్కా సెంటర్‌ నిర్వాహకుడుగా పోలీసు రికార్డులకెక్కినా జీషన్‌ అహ్మద్‌ రోజువారీ సంపాదన అన్ని ఖర్చు లు పోనూ రూ.లక్ష ఉంటుందంటే హుక్కా వ్యాపారం ఎంత లాభదాయకమో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలనే రేంజ్‌రోవర్‌ కారు కొనుగోలు చేసిన జీషన్‌ పోలీసులకు దొరక్కుండా వారి కళ్లుగప్పి ప్రతిరోజు 40 మంది రెగ్యులర్‌ కస్టమర్లను పిలిపించుకుంటూ హుక్కా సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top