ఏం తమాషా చేస్తున్నావా ‘డీసీపీ రెడ్డి’ని మాట్లాడుతున్నా..!

Fake DCP Arrest in Hyderabad - Sakshi

ఏకంగా ఐపీఎస్‌లనూ ఏమార్చిన సూడోగాడు

పోలీస్‌ స్టేషన్లలోనూ తన హవా నడిపిన వైనం

గిద్దలూరులో ‘స్టేషన్‌ విజిట్‌’తో చిక్కిన వినోద్‌

సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎస్‌ నుంచి ఎస్‌ఎస్‌బీ వరకు వివిధ విభాగాల పేర్లు, అనేక హోదాలు వాడేసి మోసాలకు పాల్పడుతూ గురువారం మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన సూడో కర్నాటి గురువినోద్‌కుమార్‌ రెడ్డి తన పేరును ట్రూకాలర్‌ యాప్‌లో ‘డీసీపీ రెడ్డి సార్‌’గా సేవ్‌ చేసుకున్నాడు. దీనికి తోడు కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన నెంబర్లనే వాడి ఫోన్లు చేయడంతోనే ఎక్కువ మంది అతడి బుట్టలో పడ్డారు. ఇతని తొలిసారి కటకటాల్లోకి పంపింది అతడి స్వస్థలమైన గిద్దలూరు పోలీసులే. అప్పట్లో అక్కడ స్టేషన్‌ విజిట్‌కు వెళ్లి బుక్కయ్యాడు. ఈ మోసగాడి చేతిలో దగా పడిన వారు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. 

ఆన్‌లైన్‌లో జాబితా చెక్‌ చేయడంతో...
వినోద్‌ ప్రకాశం జిల్లా, గిద్దలూరు నుంచి 2017లో హైదరాబాద్‌కు వచ్చి సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. ఏ పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయాడు. అప్పటికే బంధువులు, స్నేహితులకు ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు చెప్పుకున్నాడు. 2016లో సివిల్స్‌ రాసి ఐపీఎస్‌కు ఎంపికైనట్లు బోగస్‌ ఐడీ కార్డు తయారు చేశాడు. దీనిని తీసుకుని తన స్వస్థలానికి వెళ్లి అందరినీ నమ్మించాడు. తన తండ్రితో పాటు మేనమామనూ ఓసారి హైదరాబాద్‌ తీసుకువచ్చి జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ) వద్దకు తీసుకువెళ్లాడు. విజిటింగ్‌ అవర్స్‌లో అకాడమీ లోపలికి తీసుకెళ్లి తిప్పడంతో పాటు తాను ఐపీఎస్‌ అయినందుకే లోపలకు వచ్చే అనుమతి వచ్చిందని, ఇందులోనే తాను శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పాడే. మరోసారి తన ఊరికి వెళ్లినప్పుడు మరింత బిల్డప్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో గిద్దలూరు ఠాణాను సందర్శించాడు. అక్కడి ఎస్సైకి తాను ఐపీఎస్‌ అని చెప్పడంతో ఆయన ఏకంగా తన కుర్చీనే ఇచ్చి కూర్చోబెట్టారు. ఇతడి మాటతీరు, వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన అతను ఆపై అతడి స్నేహితుల వద్ద ఆరా తీశారు. ఈ నేపథ్యంలో వినోద్‌ తాను 2016లో ఐపీఎస్‌కు ఎంపికైనట్లు చెప్పినట్లు తెలిసింది. ఆ ఏడాది ఐపీఎస్‌కు ఎంపికైన వారి జాబితాను ఎన్‌పీఏ అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించిన ఎస్సై జరిగిన మోసాన్ని గ్రహించాడు. వెంటనే వినోద్‌ను తన ఠాణాకు పిలిచి అరెస్టు చేసి జైలుకు పంపాడు. 

వివాహితనూ ట్రాప్‌ చేసిన వినోద్‌...
ఈ సూడోగాడు రైళ్లల్లో ప్రయాణించిన ప్రతిసారీ అక్కడ ఉన్న ఆర్పీఎఫ్‌ సిబ్బందికి తన బోగస్‌ ఐడీ కార్డు చూపించే వాడు. ఇటీవల చెన్నై నుంచి ప్రయాణిస్తూ నకిలీ గుర్తింపుకార్డుతో పాటు మాజీ మేజర్‌ ఇంటి నుంచి చోరీ చేసిన డమ్మీ పిస్టల్‌ చూపించి ఐపీఎస్‌ అధికారిగా నమ్మించాడు. దీంతో వారు అతడికి  రాచమర్యాదలు చేయడంతో పాటు ఆ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న వారికీ ఈ విషయం చెప్పి నిశ్శబ్ధంగా ఉండాలని, ఆయన్ను డిస్ట్రబ్‌ చెయ్యవద్దంటూ హడావుడి చేశారు. అదే బోగీలో వినోద్‌తో కలిసి ప్రయాణించిన ఓ వివాహిత ఈ హంగామాకు ఆకర్షితురాలైంది. ఇద్దరూ తమ ఫోన్‌ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఎయిర్‌ఫోర్స్‌ నుంచి వివిధ విభాగాల యూనిఫాంతో కూడిన ఫొటోలు చూసిన ఆమె పూర్తిగా అతడి వల్లో పడిపోయింది. అప్పటి నుంచి తరచూ ఫోన్‌లో, సోషల్‌మీడియా ద్వారా ఆమెతో సంప్రదింపులు కొనసాగించిన వినోద్‌ మాయమాటలు చెప్పి ట్రాప్‌ చేశాడు. ఈ మాటల నేపథ్యంలోనే ఆమె భర్త శామీర్‌పేట్‌ జినోమ్‌ వ్యాలీలోని ఓ సంస్థలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. అతడి ఉద్యోగం పోగొట్టడంతో పాటు వివాహిత కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే ఆమె తనతో వస్తుందని వినోద్‌ భావించాడు.

జినోమ్‌ వ్యాలీ డేటా పొంది...
దీంతో రంగంలోకి దిగిన వినోద్‌ జినోమ్‌ వ్యాలీలో ఉన్న ఆ సంస్థ నిర్వాహకుల వివరాలు సంగ్రహించాలని భావించాడు.  వెంటనే శామీర్‌పేట్‌ పోలీసులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదనపు ఎస్పీగా ఫోన్‌ చేసి ఆ వ్యాలీలో ఉన్న అన్ని సంస్థల వివరాలు కావాలని కోరడంతో పోలీసులు ఈ–మెయిల్‌ ద్వారా పంపారు. అందులో తనకు కావాల్సిన కంపెనీ వివరాలు ఎంచుకున్న వినోద్‌ సదరు సంస్థ నిర్వాహకుడి ఫోన్‌ చేశాడు. ఫలానా వ్యక్తిపై (సదరు వివాహిత భర్త) కేసు దర్యాప్తులో ఉందని, పూర్తి వివరాలు తెలపాలని కోరాడు. ఇలా చెప్తే ఆయన ఉద్యోగం పోతుందని పథకం వేశాడు. అయితే ఫోన్‌కాల్‌లో వివరాలు ఇవ్వడానికి నిరాకరించిన సంస్థ నిర్వాహకుడు నేరుగా అధికారిక లేఖ తీసుకుని లేదా స్థానిక పోలీసుల ద్వారా రావాలంటూ స్పష్టం చేశాడు. దీంతో వెంటనే శామీర్‌పేట పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అతడి మాటలపై  అనుమానం వచ్చిన పోలీసులు తమ నుంచి కంపెనీల డేటా తీసుకున్న ‘ఐపీఎస్‌ అధికారి’ ప్రమేయాన్ని శంకించారు. అప్పట్లో ఆయన కాల్‌ చేసిన నెంబర్‌కు కాల్‌బ్యాక్‌ చేయగా, ట్రూకాలర్‌లో ‘డీసీపీ రెడ్డి సార్‌’గా ఉన్నప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించినా,  స్పందన లేకపోవడంతో లోతుగా ఆరా తీసి నకిలీ పోలీసుగా గుర్తించారు. దీంతో వినోద్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పీటీ వారెంట్‌పై అరెస్టు చేయనున్నారు.

ఒకే ఒక్క మంచిపని..
తన కుటుంబంతో పాటు స్నేహితులు, అపరిచితులను మోసం చేసిన వినోద్‌ ఒక్క మంచిపని చేశాడు. అతడి స్నేహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి సోదరి అనారోగ్యానికి గురైంది. కరీంనగర్‌లో ఆమెకు చికిత్స చేసిన వైద్యులు రూ.1.2 లక్షల బిల్లు వేశారు. వారికి కాల్‌ చేసిన ‘డీసీపీ రెడ్డి సార్‌’ బేరసారాలు లేకుండా రూ.40 వేల కన్సెషన్‌ ఇప్పించాడు. వినోద్‌ను అరెస్టు చేసిన మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నకిలీ ఐడీ కార్డులు, ల్యాప్‌టాప్‌ తదితరాలతో పాటు శక్తిమంతమైన బైనాక్యులర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని దేని కోసం సంగ్రహించాడనే కోణంపై  ఆరా తీస్తున్నారు. వీటిని వినియోగించి ప్రైవేట్‌ గూçఢచర్యం నిర్వహించడం వంటివి చేశాడా అనే విషయమై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇతడి మూడు ఎన్‌ఐఏ డైరీలను గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అవి ఇతడికి ఎలా చేరాయనే అంశాన్నీ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇతగాడు బోగస్‌ ఐడీ కార్డులు తయారు చేయించిన ప్యారడైజ్‌లోని దుకాణం ఇప్పుడు మూతపడినట్లు పోలీసులు గుర్తించారు. వినోద్‌ను గాంధీనగర్‌ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top