వీడో సూడో!

Fake Police Arrest in Hyderabad - Sakshi

నాలుగు ప్రభుత్వ విభాగాలను వాడేసిన ఘనుడు

ఇప్పటికే రెండుసార్లు కటకటాల్లోకి

మాజీ మేయర్‌ ఇంట్లో చోరీ.. అరెస్ట్‌

సాక్షి, సిటీబ్యూరో: ఒకసారి ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌... మరోసారి పోలీసు అధికారి... హఠాత్తుగా ఎన్‌ఐఏ ఏఎస్పీ... ఈవేవీ కాకపోతే శశస్త్ర సీమా బల్‌ డిప్యూటీ కమాండెంట్‌... ఇలా అవసరం, అవకాశాన్ని బట్టి అవతారం ఎత్తుతూ మోసాలకు పాల్పడుతున్న ‘సూడోగాడిని’ మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఐదు విభాగాల పేర్లు వాడేసిన ఈ ఘరానా మోసగాడు ఇప్పటికే రెండుసార్లు జైలుకు వెళ్లాడు. అయినా తన పంథా మార్చుకోకుండా మోసాలు కొనసాగిస్తూ మరోసారి చిక్కినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావుతో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

ఐపీఎస్‌ అధికారి కావాలని...
వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన గురివిరెడ్డి ఆర్మీలో పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రకాశం జిల్లా గిద్దలూరులో స్థిరపడ్డాడు. అతడి కుమారుడైన కర్నాటి గురు వినోద్‌కుమార్‌ రెడ్డి 2012–15లో గిద్దలూరులోనే డిగ్రీ పూర్తి చేశాడు. పోలీసు విభాగం పట్ల మక్కువ ఉన్న వినోద్‌ చిన్ననాటి నుంచి ఐపీఎస్‌ అధికారి కావాలని కలలుగన్నాడు. ఈ నేపథ్యంలో 2017లో హైదరాబాద్‌కు వచ్చి అశోక్‌నగర్‌లోని ఓ ప్రముఖ సంస్థలో ఎనిమిది నెలల పాటు సివిల్స్‌ కోచింగ్‌ తీసుకున్నాడు. ఆ సమయంలో మరికొందరు స్నేహితులతో కలిసి ఓ గదిలో అద్దెకు ఉండేవాడు. ఇతడి స్నేహితుల్లో పలువురు వివిధ విభాగాల్లో ఉద్యోగాలు సాధించారు. ఇతను మాత్రం యూపీఎస్సీ, ఐఎఫ్‌ఎస్, ఎస్‌ఎస్‌సీ, సీజీఎల్, ఏపీపీఎస్సీలతో పాటు చివరకు ఎస్సై పరీక్ష రాసినా విజయం సాధించలేకపోయాడు.

స్నేహితులు, బంధువుల కోసమని...
ఆయా పోటీ పరీక్షల్లో తాను విజయం సాధించలేదని చెప్పుకోవడానికి వినోద్‌ సిగ్గుపడ్డాడు. దీంతో ఇతడు ఉద్యోగం సా«ధించాడని భావించిన కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు అక్కడకు వెళ్లినప్పుడల్లా వివరాలు అడిగేవారు. దీంతో పథకం వేసిన వినోద్‌ తనను ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా పేర్కొంటూ తొలిసారిగా ఓ బోగస్‌ గుర్తింపుకార్డు తయారు చేశాడు. దీనిని పట్టుకుని తన గ్రామానికి వెళ్లిన ఇతగాడు అది చూపించి మోసం చేశాడు. 2016లో మళ్లీ సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షలు రాసి ఫెయిల్‌ అయ్యాడు. ఈ విషయాన్నీ తన వారి దగ్గర దాచిన వినోద్‌ ఈసారి ఏకంగా ఐపీఎస్‌ అధికారిగా బోగస్‌ ఐడీ కార్డు తయారు చేశాడు. దీనికితోడు ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణకు అవకాశం వచ్చినట్లు కాల్‌ లెటర్‌ కూడా సృష్టిం చాడు. ఇతడి వ్యవహారాలు బయటికి పొక్కడంతో 2017లో గిద్దలూరు పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్‌ఐఏ కార్డుతో ‘డిఫెన్స్‌’లోకి...
ఈ కేసులో జైలు నుంచి బయటకు వచ్చిన వినోద్‌ ఈసారి ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదనపు కమాండెంట్‌ అవతారం ఎత్తి ఆ గుర్తింపుకార్డు తయారు చేశాడు. దీనిని ధరించి నేరేడ్‌మెట్‌ పరిధిలో డిఫెన్స్‌ ఆధీనంలో ఉండే డిఫెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజ్‌లోకి (డీఎంసీ) ప్రాంగణంలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడు. అతడిని పట్టుకున్న డిఫెన్స్‌ అధికారులు పోలీసులకు అప్పగించడంతో జైలుకు వెళ్ళాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన వినోద్‌ మళ్లీ‘సివిల్స్‌ యుద్ధం’ ప్రారంభించాడు. మరోసారి అశోక్‌నగర్‌లోని అదే సంస్థలో కోచింగ్‌కు చేరాడు. అక్కడ సోషియాలజీ ఫ్యాకల్టీగా పని చేస్తున్న మాజీ మేజర్‌తో ఎన్‌ఐఏ అదనపు ఎస్పీగా పరిచయం చేసుకున్నాడు. ఇతడిని పూర్తిగా నమ్మిన ఆయన తనకు పరిచయస్తులైన కొందరు అధికారుల వద్దకూ తీసుకువెళ్ళాడు. ఈ ఏడాది తన ఇంటికి తీసుకువెళ్లగా అదను చూసుకుని అక్కడ ఉన్న ఓ డమ్మీ పిస్టల్‌తో పాటు ఇతర వస్తువులను చోరీ చేశాడు. 

మాజీ మేజర్‌ ఆరా తీయడంతో...
ఈ విషయం గుర్తించిన ఆ మాజీ మేజర్‌ ఎన్‌ఐఏ కార్యాలయానికి వెళ్లి వినోద్‌ వ్యవహారంపై ఆరా తీశారు. దీంతో అలాంటి అధికారి తమ వద్ద లేరని చెప్పడంతో మోసం బయటపడింది. దీంతో ఆయన గాంధీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే వినోద్‌ శామీర్‌పేటలో చేసిన మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఐపీఎస్‌ అధికారిగా అక్కడకు వెళ్లి కొంత డేటా సంగ్రహించాడని బయటపడటంతో మరో కేసు నమోదైంది. మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సై కె.శ్రీనివాసులుతో కూడిన బృందం గాలింపు చేపట్టి వినోద్‌ను అదుపులోకి తీసుకుంది. విచారణ నేపథ్యంలో తన బోగస్‌ హోదాలను రైల్వే రిజర్వేషన్లు, సినిమా టిక్కెట్లు, పార్కులు, షాపింగ్‌ మాల్స్‌తో పాటు దేవాలయాల్లో వీఐపీ దర్శనాలకు వినియోగించినట్లు వెల్లడైంది. అతడి నుంచి పోలీసులు శశస్త్ర సీమా బల్‌ డిప్యూటీ కమాండెంట్‌ ఐడీ కార్డు, ల్యాప్‌టాప్, డమ్మీ పిస్టల్‌ తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని గాంధీనగర్‌ పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top