ఆకతాయిలకు షాక్ | Electro shoes for Women safety | Sakshi
Sakshi News home page

ఆకతాయిలకు షాక్

Oct 24 2017 1:31 PM | Updated on Jul 11 2019 6:28 PM

Electro shoes for Women safety - Sakshi

మృగాళ్ల అకృత్యాలకు ఎందరో అతివలుబలవుతున్నారు. దేశంలో ఏదో ఒక చోట రోజూ అత్యాచారాలు, మహిళలపై దాడులుజరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకోవడం ఆ యువశాస్త్రవేత్తలో ఆలోచనలు రేకెత్తించాయి. మహిళా భద్రతకు ఏదైనా చేయాలనే సంకల్పాన్నికల్పించాయి. నిర్భయ ఘటనను చూసి చలించిన ఆ యువకుడు... రెండేళ్లు శ్రమించి ‘ఎలక్ట్రో షూ’లను రూపొందించాడు.ఆకతాయిలు మహిళలపై దాడికి పాల్పడినప్పుడు ఈ షూల ద్వారా షాక్‌ రావడంతో పాటు...పోలీసులు, బంధువులకు అలర్ట్‌ మెసేజ్‌ వెళ్తుంది. ఈ పరికరం, తన పరిశోధన గురించి నగరానికి చెందిన సిద్ధార్థ్‌ మందల చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే...

నాకు 12 ఏళ్లున్నప్పుడు నిర్భయ ఘటన జరిగింది. నిరసన ర్యాలీల్లో అమ్మతో పాటు నేనూ పాల్గొన్నాను. అప్పుడు మనసులో ఒకటే ఆలోచన... ఈ ఘోరం మనవాళ్లలో ఎవరికైనా జరిగితే? ఆ ఆలోచన చాలా రోజులు వెంటాడింది. అప్పుడే లక్ష్యం నిర్దేశించుకున్నాను. మహిళా భద్రతకు ఏదో ఒకటి చేయాలనుకున్నాను. నా ఆలోచనకు అనుగుణంగా స్నేహితుడు అభిషేక్‌ సహాయంతో ఈ ఎలక్ట్రో షూలను తయారు చేశాను.  
 
ఆటోమేటిక్‌ చార్జింగ్‌.. అలర్ట్‌ మెసేజ్‌  
పీజోఎలక్ట్రిక్‌ ఎఫెక్ట్‌ ఆధారంగా సర్క్యూట్‌ బోర్డులను తయారు చేసి ఈ షూలలో అమర్చాను. వీటిని ధరించిన మహిళలపై ఎవరైనా దాడికి పాల్పడితే.. వాటి ద్వారా 0.1 ఆంపియర్‌ షాక్‌ వస్తుంది. అదే సమయంలో పోలీసులు, బంధువులకు అలర్ట్‌ మెసేజ్‌
వెళ్తుంది. నడుస్తున్నప్పుడే ఆటోమేటిక్‌గా ఇవి చార్జింగ్‌ అవుతాయి.   

రెండేళ్ల శ్రమ...  
ఈ షూలను రూపొందించేందుకు చాలా కష్టపడ్డాం. సోషల్‌ మీడియా ద్వారా చాలా మంది గైడ్‌లను కాంటాక్ట్‌ చేశాను. వివిధ భాషల్లో ప్రోగ్రామింగ్‌ చేయడం నేర్చుకున్నాను. కొన్నిసార్లు కరెంట్‌ షాక్‌లు తగిలాయి. ఓసారి నా స్నేహితుడికి గాయమైంది. ఏదైతేనేం అనేక ప్రయత్నాల అనంతరం ఫలితం వచ్చింది. రెండేళ్ల తర్వాత నా ప్రయోగం సక్సెస్‌ అయింది. ఈ షూలు కొందరి జీవితాలు కాపాడినా చాలు. ఎలక్ట్రో షూతో పాటు పోర్టబుల్‌ వాటర్‌ ప్యూరిఫయర్‌నూ రూపొందించాను. మిత్రులతో కలిసి ‘కాగ్నిజెన్స్‌ వెల్‌ఫేర్‌ ఇనిషియేటివ్‌’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాను.  

ఎన్నో చర్చలు.. సెషన్స్‌  
వేసవి సెలవుల్లో డాక్టర్‌ ఏఎస్‌ కుమార్‌ దగ్గర ఇంటర్న్‌షిప్‌ చేశాం. జెనోమిక్స్, ప్రొటీన్, మలిగ్నంట్‌ మెలనోమా పనితీరుపై.. పోలరైజ్డ్‌ లెన్సెస్‌ సహాయంతో చర్మ కణాల తీరులో తేడాలు గుర్తించాను. అప్పుడే చిత్రాల ద్వారా  కంప్యూటర్‌లో ఈ తేడాను గుర్తించే అవకాశం ఉందా? అని ఆలోచించాను. ప్రణీత్, నేను ట్రై చేయగా వర్కవుట్‌ అవుతుందనిపించింది. ఇక డాక్టర్‌తో అనేక చర్చలు, ప్రాక్టికల్‌ సెషన్స్‌ తర్వాత ఈ సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టాం.      – సిద్ధార్థ్‌  

స్కిన్‌ కేన్సర్‌ గుర్తించే సాఫ్ట్‌వేర్‌
ఎలక్ట్రో షూని కనిపెట్టిన సిద్ధార్థ్‌... స్నేహితుడు ప్రణీత్‌ షాతో కలిసి మరో ఆవిష్కరణకు బీజం పోశాడు. వీరిద్దరు కలిసి చర్మ కేన్సర్‌ను కనుగొనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ చర్మ కేన్సర్‌ తొలి దశలో.. అంటే మలిగ్నంట్‌ మెలనోమాని గుర్తిస్తుంది. ఫోన్‌ కెమెరా సహాయంతో లైవ్‌ స్ట్రీమ్‌ చేస్తూ కంప్యూటర్‌లో కనిపించే ఫీడ్‌ ద్వారా అది కేన్సరో? కాదో? గుర్తించొచ్చు. ‘మాకు అందుబాటులో ఉన్న సాధనాలతోనే దీన్ని కనిపెట్టే విషయంలో అపోలో హాస్పిటల్‌ డాక్టర్‌ ఏఎస్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. ఖరీదైన పరికరాలు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో చర్మ కేన్సర్‌ను గుర్తించేందుకు ఇది ఉపయుక్తం’ అని చెప్పారు సిద్ధార్థ్‌.  

ఇంటర్నెట్‌ మాడ్యూల్‌కి మారుస్తా..   – ప్రణీత్‌ షా 
కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్, ఎకనామిక్స్‌ చదువుతున్నాను. ఓ సోషల్‌ ఇంటర్న్‌షిప్‌లో సిద్ధార్థ్‌ని కలిశాను. ఈ ప్రయోగంలో టెక్నికల్‌కు సంబంధించి నేను సహాయం చేశాను. ఏ ప్రాంతంలో అయినా వినియోగించే విధంగా సాధారణ మొబైల్, కంప్యూటర్‌ని ఒకే రూటర్‌కి కనెక్ట్‌ చేయాలి. దీనిని భవిష్యత్తులో ఇంటర్నెట్‌ మాడ్యూల్‌కి మార్చే ప్రయత్నం చేస్తాం.                             

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement