కరెంటు కాటుకు ముగ్గురు బలి

Electric Shock Three Numbers Died in Adilabad - Sakshi

దహెగాం(సిర్పూర్‌): విద్యుదాఘాతానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ముగ్గురు బలయ్యారు. వేర్వేరు చోట్ల ఈ విద్యుత్‌ ప్రమాదాలు జరిగాయి. దహెగాంలో వరి పొలాన్ని సిద్ధం చేయడానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటారు ఆన్‌చేసి చేతులు కడుగుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి రైతు పొలంలోనే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. దహెగాం మండలంలోని కుంచవెల్లి గ్రామానికి చెందిన తెలిగే భుజంగ్‌రావుకు (40) రెండు ఎకరాల వరి పొలం ఉంది. పొలాన్ని సిద్ధం చేయడం కోసం నీళ్లు పెట్టడానికి బుధవారం ఉదయం వెళ్లాడు. పొలంలోని మోటార్‌ను ఆన్‌ చేశాడు. నీళ్లు పోస్తుండగా చేతులు కడుక్కుంటుండగా మోటారుకు విద్యుత్‌ సరఫరా అయింది

 మోటార్‌ వర్షానికి తడవకుండా రేకు డబ్బా ఏర్పాటు చేశారు. పైన ఉన్న పైప్‌ కూడా ఇనుముదే కావడంతో షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెంది విగత జీవిగా పడిపోయాడు. పక్క పొలం వారు నాట్లు వేయడానికి వెళ్లి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వరి నారు ఎదిగింది.. పొలం సిద్ధం చేయాలంటూ నీళ్లు పెట్టడానికి వెళ్లిన భుజంగ్‌రావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. భుజంగ్‌రావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై మల్లేశ్‌ తెలిపారు.

ఖానాపూర్‌లో ఇంటి వద్ద షాక్‌ తగిలి..
ఖానాపూర్‌: విద్యుదాఘాతంతో మండలంలోని బీర్నంది గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్‌ తెలిపిన వివరాలివీ.. గ్రామానికి చెందిన  బోర్లకుంట రాజేందర్‌(29) మంగళవారం రాత్రి ఇంటి వద్ద బోరు వేసేందుకు వెళ్లగా అది ప్రారంభం కాలేదు. పలుమార్లు ప్రారంభించేందుకు ప్రయత్నించగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజేందర్‌కు భార్య రజిత, కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తాండూర్‌లో వృద్ధురాలు
తాండూర్‌(బెల్లంపల్లి):    తాండూర్‌ మండలం కాసిపేట గ్రామంలో విద్యుదాఘాతానికి గురై వేయిగండ్ల అమ్మక్క (70) మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. అమ్మక్కకు కుమారులు రాజయ్య, శంకర్‌ కాగా, అదే గ్రామంలో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. పెద్ద కుమారుడు రాజయ్య 3 నెలల క్రితం  అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్నకుమారుడు శంకర్‌ వద్ద ఉన్న అమ్మక్క బుధవారం ఉదయం రాజయ్య ఇంటికి నడుకుంటూ వెళ్తుండగా బురదతో కాలుజారి పక్కనే ఉన్న ఇనుప విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకుంది.

ఆ స్తంభానికి విద్యుత్‌ ప్రసారం ఉండడంతో అమ్మక్క ఒక్కసారిగి విద్యుత్‌షాక్‌కు గురైంది. గమనించిన స్థానికులు అమ్మక్కను కాపాడే ప్రయత్నం చేసినా తీవ్రమైన షాక్‌ తగిలినందున మృతి చెందింది. 3 నెలల వ్యవధిలోనే ఆ కుటుంబంలో మరొకరు మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్‌ దిలీప్‌కుమార్, విద్యుత్‌ ఏఈ శ్రీనివాస్, సిబ్బంది, తాండూర్‌ ఎస్సై కె.రవి పరిశీలించారు. విద్యుత్‌ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top