హత్య కేసులో నిందితుల రిమాండ్‌

Devika And Her Boyfriend Remands In Murder Case - Sakshi

బంజారాహిల్స్‌:  వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితురాలితో పాటు ఆమె ప్రియుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా, మాచర్లకు చెందిన బానోతు జగన్, దేవిక అలియాస్‌ దేవి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్‌ నగర్‌ బస్తీలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా దేవిక అడ్వాన్‌ సాఫ్ట్‌ ఇంటర్నేషనల్‌ కంపెనీలో లైజన్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న తోట బెనర్జితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిని గుర్తించిన జగన్‌ పలుమార్లు ఆమెను మందలించాడు. అయినా తన వైఖరి మార్చుకోకపోగా, తనకు విడాకులు ఇస్తే బెనర్జీని పెళ్లి చేసుకుంటానని ప్రియుడిని ఏకంగా తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లింది. దీంతో వారు దేవిక, బెనర్జిలను బెదిరించి కాపురం చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

అయినా దేవికలో మార్పు రాకపోగా ప్రియుడిని ఏకంగా తాను అద్దెకుంటున్న ఇంటిపైనే పెంట్‌హౌజ్‌కు రప్పించింది. గత రెండు నెలలుగా భర్త కళ్లుగప్పి ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇటీవల జగన్‌ ఆమెను తీవ్రంగా మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని వారు పథకం పన్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 2.30 ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న జగన్‌ మొహంపై బెనర్జీ కుక్కర్‌తో దాడి చేయగా, దేవిక అతని కళ్లల్లో పురుగుల మందు కొట్టి స్పృహతప్పేలా చేసింది. ప్రైవేట్‌ పార్టులను గట్టిగా ఒత్తడంతో అతను అపస్మారకస్థితికి చేరుకున్నాడు. బెనర్జి అతడి గొంతుపిసికి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో నిద్రలేచిన జగన్‌ కుమారుడు ఉదయ్, కుమార్తె జ్యోతిషశ్రీని దేవిక బాత్‌రూమ్‌లోకి తోసి గడియ పెట్టింది.

జగన్‌ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత బెనర్జి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తానే హత్య చేసినట్లు నమ్మించేందుకు దేవిక గాజుపెంకులతో చేతులు కోసుకుంది. పోలీసుల సమక్షంలో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మొదట బుకాయించినా, మరింత లోతుగా విచారించడంతో తానే హత్య చేశానని అంగీకరించింది. జగన్‌ కుమారుడు ఉదయ్‌ అర్ధరాత్రి గడ్డం అంకుల్‌ వచ్చాడని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో సమీపంలోని  డాక్టర్‌ లీలానాయక్‌ ఇంటి ఎదుట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ యువకుడు ఇంటి ముందు బైక్‌ పార్క్‌ చేయడం, గంట తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ ఫొటోను ఉదయ్‌కు చూపించగా అర్ధరాత్రి వచ్చింది అతనేనని తెలిపాడు. నిందితురాలి సోదరుడు కూడా గతంలో జరిగిన గొడవ విషయం చెప్పడంతో పోలీసులు  స్నేహితుడి ఇంట్లో దాక్కున్న బెనర్జిని అరెస్ట్‌ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top