‘జేఎన్‌యూ’ కేసులో చార్జిషీట్‌

delhi police charge sheet against kanhaiya kumar - Sakshi

మూడేళ్ల తర్వాత దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు

కన్హయ్య కుమార్‌ తదితరులపై దేశద్రోహం ఆరోపణలు

న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి దేశద్రోహం కేసులో ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్, ఇతర నిందితులపై ఢిల్లీ పోలీసులు సోమవారం అభియోగపత్రం (చార్జిషీట్‌) దాఖలు చేశారు. కన్హయ్యతోపాటు జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్‌ ఖలీద్, అనిర్బన్‌ భట్టాచార్యలపై దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగాలను పోలీసులు మోపారు.

2001లో పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడికి సూత్రధారి అయిన అఫ్జల్‌ గురు వర్ధంతిని జేఎన్‌యూ క్యాంపస్‌లో 2016 ఫిబ్రవరి 9న కన్హయ్య కుమార్, ఇతర విద్యార్థులు నిర్వహించడంతో వారిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే మూడేళ్ల తర్వాత పోలీసుల చేత బీజేపీ ఈ పని చేయిస్తోందని నిందితులు, ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా, అభియోగపత్రంలో కశ్మీరీ విద్యార్థులు అఖీబ్‌ హుస్సేన్, ముజీబ్‌ హుస్సేన్, మునీబ్‌ హుస్సేన్, ఉమర్‌ గుల్, రయీయా రసూల్, బషీర్‌ భట్, బషరత్‌ల పేర్లు కూడా ఉన్నాయి.

మొత్తం 36 మందిలో సీపీఐ నేత డి. రాజా కూతురు అపరాజిత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షురాలు షెహ్లా రషీద్, బానోజ్యోత్స్న లాహిరి, రమా నాగ తదితరులున్నారు. బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగపత్రాన్ని పరిశీలించనుంది. సీసీటీవీ ఫుటేజీ, మొబైల్‌ ఫుటేజీతోపాటు పలు పత్రాలను కూడా పోలీసులు అభియోగపత్రంతోపాటు కోర్టుకు సమర్పించారు. దేశ వ్యతిరేక నినాదాలు చేసేలా కన్హయ్య కుమారే అక్కడున్న గుంపును రెచ్చగొట్టాడని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

రాజకీయ ప్రేరేపితమే: కన్హయ్య
ఇన్నాళ్ల తర్వాత చార్జిషీట్‌ వేయడం తమకు మంచిదేననీ, కేసు విచారణ పూర్తయితే నిజానిజాలు ఏంటో బయటకొస్తాయని కన్హయ్య అన్నారు. సీపీఐ నేత డి. రాజా మట్లాడుతూ రాజకీయ కారణాలతోనే ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేస్తున్నారనీ, దీనిపై తాము కోర్టులోనూ, కోర్టు బయట రాజకీయంగానూ పోరాడతామని వెల్లడించారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని కేసులో మరో నిందితుడు ఉమర్‌ ఖలీద్‌ ఆరోపించారు. షెహ్లా రషీద్‌ మాట్లాడుతూ ఇది నకిలీ కేసు అనీ, నిందితులందరూ నిర్దోషులుగా కేసు నుంచి బయటకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

2016లో ఏం జరిగిందంటే..
ఫిబ్రవరి 9: పార్లమెంటుపై దాడి కేసులో సూత్రధారి అఫ్జల్‌ గురు వర్ధంతి రోజున అతనిని పొగుడుతూ జేఎన్‌యూ క్యాంపస్‌లో ర్యాలీ

ఫిబ్రవరి 10: దీనిపై క్రమశిక్షణా విచారణకు జేఎన్‌యూ యంత్రాంగం ఆదేశం.

ఫిబ్రవరి 11: బీజేపీ ఎంపీ మహేశ్‌ గిరి, ఆరెస్సెస్‌ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఫిర్యాదులను స్వీకరించి కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ఫిబ్రవరి 12: కన్హయ్య కుమార్‌ అరెస్ట్‌.. భారీ ఆందోళనలకు దిగిన విద్యార్థులు

ఫిబ్రవరి 15: కన్హయ్య కేసు విచారణకు ముందు పాటియాలా హౌస్‌ కోర్టులో విద్యార్థులు, పాత్రికేయులు, అధ్యాపకులను దేశ వ్యతిరేకులుగా పేర్కొంటూ న్యాయవాదుల దాడి.

ఫిబ్రవరి 25: తీహార్‌ జైలుకు కన్హయ్యను పంపిన కోర్టు

మార్చి 3: కన్హయ్యకు ఆరు నెలల బెయిలు

ఆగస్టు 26: కన్హయ్య, ఉమర్‌ ఖలీద్, అనిర్బన్‌లకు సాధారణ బెయిలు

2019 జనవరి 14: కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top