
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణంగా మనపై ఎవరైనా నలుగురు వ్యక్తులు వచ్చి కత్తులతో దాడి చేస్తున్నారంటే మనతో ఉన్నవారు పారిపోవడం చేస్తుంటారు. ఒక వేళ సాహసం చేసే ప్రయత్నం చేద్దామని అనుకున్న వారు బెదిరించగానే వెనక్కి తగ్గుతారు. కానీ, కుక్కలు మాత్రం అలా చేయవని, తమ యజమానులు ప్రమాదంలో పడితే ప్రాణాలకు తెగిస్తాయని మరోసారి రుజువైంది. ముమ్మాటికీ శునకాలు విశ్వాస జీవులే అని నిరూపితం అయింది. ఆ సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలో స్థానిక సంస్థలో ఉద్యోగి అయిన రాకేష్ (58) అనే వ్యక్తి ఆదివారం సాయంత్రం తన టైసన్ అనే కుక్కకు ఆహారం పెడుతున్నాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు రాకేష్‌పై దాడికి పాల్పడ్డారు. దీంతో టైసన్ వారికి తన విశ్వరూపాన్ని చూపింది. తన యజమానిపై దాడి చేస్తున్న వారిని చీల్చి చెండాడింది. వారు కత్తులతో దానికి గాయాలు చేసినప్పటికీ వారికి ముచ్చెమటలు పట్టించి పారిపోయేలా చేసింది. మొత్తంగా చెప్పాలంటే రాకేష్‌కు ప్రాణభిక్ష పెట్టింది. అది పోరాడుతున్న సమయంలోనే కుటుంబ సభ్యులు కూడా బయటకు రావడంతో దుండగులు పరారయ్యారు. గాయపడిన వ్యక్తిని, టైసన్‌ను ఆస్పత్రికి తరలించారు.