వాగు ఇసుకలో మృతదేహం

Dead Body Found In Canal Sand East Godavari - Sakshi

గిరిజనుడి అనుమానాస్పద మృతి

మంత్రాల నెపంతోనే హత్య చేసి ఉంటారని అనుమానం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తూర్పుగోదావరి, చింతూరు(రంపచోడవరం): అడవిలోని వాగు ఇసుకలో కప్పి ఉన్న ఓ మృతదేహం సోమవారం కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. చింతూరు మండలం బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ మృతదేహం సమీపంలోని బొడ్డుగూడేనికి చెందిన తాటి కన్నయ్య(60) అనే గిరిజనుడుగా గుర్తించారు. చింతూరు ఎస్సై శ్రీనివాస్‌కుమార్‌ కథనం ప్రకారం.. మండలంలోని బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి నడుమ జాతీయ రహదారి పక్కన ఉన్న పులివాగులో ఇసుకలో పైకిలేచి ఉన్న ఓ కాలు కనిపించడంతో దానిని గమనించిన వ్యక్తులు వీఆర్‌వోకు సమాచారం ఇచ్చారు. వీఆర్‌వో చింతూరు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా ఇసుకలో కప్పబడి ఉన్న మృతదేహం కనిపించింది. దానిని వెలికితీసిన పోలీసులు తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించి కేసు నమోదు చేసి సమీప గ్రామాల్లో విచారించారు. దీంతో మృతుడు బొడ్డుగూడేనికి చెందిన తాటి కన్నయ్యదిగా అతని బంధువులు గుర్తించినట్టు ఎస్సై తెలిపారు. భార్య లేకపోవడంతో గ్రామంలో ఉండకుండా అతను తరచూ ఇతర గ్రామాలు తిరుగుతుంటాడని, గతనెలలో జరిగిన పోలింగ్‌లో భాగంగా గ్రామంలో ఓటు వేశాడని, అనంతరం తిరిగి తాము చూడలేదని బంధువులు చెప్పినట్టు పోలీసుల విచారణలో తేలింది.

కన్నయ్య మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో అతను ఎనిమిది నుంచి పది రోజుల క్రితం మరణించి ఉండవచ్చని ఎస్సై తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మంత్రగాడనే నెపంతోనే హత్యగా అనుమానం?
మృతుడు కన్నయ్యను మంత్రగాడనే నెపంతోనే హత్యచేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రాల నెపంతో ఈ ప్రాంతంలో ఇదే తరహాలో గతంలో పలు హత్యలు జరగడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. అనారోగ్యంతో తమ వారు ఎవరైనా మరణిస్తే ఫలానా వ్యక్తి మంత్రాలు చేయడం వల్లనే అతను మృతిచెందాడనే మూఢనమ్మకంతో సాటి వారిని హత్య చేయడం వంటి ఘటనలు చింతూరు మండలంలో చాలా చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో కన్నయ్యను కూడా మంత్రగాడనే నెపంతోనే హత్యచేసి మృతదేహాన్ని వాగు ఇసుకలో పూడ్చిపెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top