
గంగరాజు, దాలమ్మ దంపతులు (ఫైల్)
విజయనగరం, గరివిడి: మరణంలోనూ ఆ దంపతులు వీడిపోలేదు. దాంపత్య జీవనంలో కష్టసుఖాల్లో ఒక్కటిగా మెలిగి జీవించిన వారు మరణంలోనూ ఒక్కటై చనిపోయారు. ఈ ఘటన తోండ్రంగిలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళ్తే...తోండ్రంగి గ్రామానికి చెందిన గొంటి గంగరాజు(62) బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి వద్దే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే మృతి చెందాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని భార్య గొంటి దాలమ్మ అ మధ్యాహ్నం నుంచి భర్త మృతదేహం వద్ద కన్నీరుమున్నీరై తీవ్ర మనస్తాపానికి గురై అపస్మారక స్థితిలో వెళ్లింది. గ్రామస్తులు గంగరాజు మృతదేహానికి దహన సంస్కారావు పూర్తి చేసుకొని రాగా దాలమ్మ(53) అపస్మారక స్థితి నుంచి బయటకొచ్చి ఏడవడం మొదలు పెట్టింది. ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలా ఏడుస్తూనే బుధవారం రాత్రి 12 గంటలకు తుది శ్వాస విడిచింది. దాలమ్మ గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పని చేస్తోంది. వీరికి నలుగురు కుమార్తెలు కాగా ముగ్గురికి వివాహమైంది. 12 గంటల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది.