
సినీ నటుడు వైజాగ్ ప్రసాద్(పాత చిత్రం)
రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఆదివారం ఉదయం మరణించారు. అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో యశోద ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. అనేక తెలుగు సినిమా, టీవీ సీరియళ్లలో ఆయన నటించారు. రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆయనకు భార్య విద్యావతి, ఇద్దరు పిల్లలున్నారు. వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ వరప్రసాద రావు. విశాఖపట్నంలోని గోపాలపట్నం ఆయన స్వస్థలం. వైజాగ్ నుంచి వచ్చారు కాబట్టి వైజాగ్ ప్రసాద్‌గా స్థిరపడిపోయింది.
ప్రసాద్ తండ్రి ఉపాధ్యాయుడు. తల్లిదండ్రులకు ముగ్గురు అమ్మాయిల తర్వాత నాలుగో సంతానంగా జన్మించారు. ఊహ తెలియక ముందే తల్లి కన్నుమూసింది. మేనమామ దగ్గరుండి ఎస్‌ఎస్‌ఎల్‌సీ దాకా చదువుకున్నారు. చదువుకునే రోజుల నుంచే నాటకాల్లో నటించేవారు. నాటకాల పిచ్చితో అగ్రికల్చర్ బీఎస్‌సీ సీటు, ఎంబీబీఎస్ సీటు పోగొట్టుకున్నారని సమాచారం.1983లో వచ్చిన బాబాయ్ అబ్బాయ్ నటుడిగా ఆయన మొదటి సినిమా. నువ్వు నేను చిత్రంలో ఆయన పోషించిన ధనవంతుడైన కథానాయకుడి తండ్రి ప్రాత మంచి పేరు తెచ్చిపెట్టింది. భద్ర, జై చిరంజీవ, గౌరీ, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి చిత్రాల్లో ఆయన నటనకు ప్రశంసలు లభించాయి.
ప్రస్తుతం వైజాగ్ ప్రసాద్ కుమార్తె, కుమారులు అమెరికాలో ఉన్నారు. వారు రాగానే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. 'మా' తరపున వైజాగ్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు 'మా' అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.