చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్సు | Child Died In School Bus Accident hyderabad | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన స్కూల్‌ బస్సు

Jul 11 2018 9:10 AM | Updated on Sep 4 2018 5:44 PM

Child Died In School Bus Accident hyderabad - Sakshi

కుమారుడి మృతదేహాం వద్ద రోదిస్తున్న తల్లి స్వాతి, బంధువులు,ఇన్‌సెట్‌లో తన్వీష్‌ (ఫైల్‌)

పెద్దఅంబర్‌పేట: తన సోదరుడిని పాఠశాలకు పంపించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి బాలుడిని రెప్పపాటులో  మృత్యువు కబలించింది. ప్రతి రోజూ స్కూల్‌ బస్సు వరకు వచ్చి అన్నకు టాటా చెప్పే ఆ చిన్నారిని అదే స్కూల్‌ బస్సు మృత్యువు ఒడిలోకి తీసుకువెళ్లిన దుర్ఘటనను ఆ చిన్నారి తల్లిదండ్రులు, గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్లు మూసి తెరిచేలోపే బుడిబుడి అడుగులు వేస్తూ చిట్టిపొట్టి మాటలతో ఆడుకునే తన ముద్దుల కొడుకు కళ్ల ముందే మృత్యువాత పడడంతో ఆ తల్లి రోదన స్థానికులను కన్నీరుపెట్టించింది. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారమతిపేట గ్రామానికి చెందిన బుర్ర నర్సింహ, బుర్ర స్వాతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు జశ్వంత్‌ హయత్‌నగర్‌లోని శాంతినికేతన్‌ స్కూల్‌లో చదువుతుండగా, రెండోవాడు తన్వీష్‌ (3) ఇంటి దగ్గరే ఉంటున్నాడు. 

బస్సు చక్రం కిందపడి..
తన కుమారుడిని స్కూల్‌కు పంపించేందుకు రోజు మాదిరిగానే స్కూల్‌ బస్సు (ఏపీ29టీబీ8114)) ఎక్కించేందుకు స్వాతి మంగళవారం ఉదయం 7:40గంటల సమయంలో తన ఇద్దరు కొడుకులతో కలిసి బస్సు దగ్గరికి వెళ్లింది. జశ్వంత్‌ను బస్సులో ఎక్కించే క్రమంలో తల్లి పక్కనే ఉన్న తన్వీష్‌ బస్సు ముందు నుంచి రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా స్కూల్‌ బస్సు ఒక్కసారిగా ముందుగా కదిలింది. దీంతో బస్సు కింద పడిని తన్వీష్‌పై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఎక్కడ ఉన్నాడని చూసేలోపే స్వాతికి తన కుమారుడు విగతజీవిగా పడి కనిపించాడు. దీంతో ఒక్కసారిగా స్వాతి కుప్పకూలిపోయింది. తన చిన్న కొడుకు మృతి చెందాడన్న చేదు నిజాన్ని భరించలేక రోదిస్తున్న తీరు స్థానికుల కంట నీరు పెట్టించింది. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement