లైంగిక వేధింపులు : తండ్రి ఏం చేశాడంటే..

Chandigarh Man Extraordinary Mission To Fight Daughter Assaulters - Sakshi

సాక్షి, చండీగడ్‌: కుమార్తెకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాడుతున్న తండ్రి గాథ ఇది. టెన్నిస్‌ నేర్చుకోవడానికి వెళ్లిన కుమార్తెపై లైంగిక వేధింపులను తండ్రి గుండె తట్టుకోలేక పోయింది. న్యాయంకోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. అయితే నిందితులు మైనర్‌ పేరుతో విచారణనుంచి, శిక్షనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో ఆయన మరింత ఆందోళన పడ్డారు.  దోషులను అంత తేలికగా వదలకూడదనే పట్టుదలతో  తన న్యాయ పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ క్రమంలో చివరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు.

చండీగఢ్‌లోని అకాడమీ ఆఫ్ రూరల్ టెన్నిస్లో మహిళా ట్రైనీని లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో గత ఏడాది ఆగస్టులో కేసు నమోదైంది.  జూనియర్ డేవిస్ కప్ ప్లేయర్‌తో సహా ఐదుగురు నిందితులపై కోర్టులో అభియోగాలు దాఖలయ్యాయి. విచారణ సమయంలో(టెన్నిస్ అకాడమీ) అందించిన నిందితుల జనన ధృవీకరణ పత్రాలను చండీగఢ్‌ పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో కోర్టు ముగ్గురు నిందితులకు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేని బాధితురాలి తండ్రి అవి తప్పుడు ధృవీకరణ పత్రాలని, నిందితులు మైనర్లు కాదని నిరూపించేందుకు నడుం బిగించారు. నిజమైన పత్రాల కోసం నిందితుల  గ్రామాలకు వెళ్లారు. నెలల తరబడి హర్యానాలోని రోహ్తక్, పాల్వాల్, హిసార్లలో పర్యటించి, ముగ్గురు నిందితులు చదివిన ప్రాథమిక స్థాయి ప్రభుత్వ పాఠశాలలకు చేరుకుని,  అక్కడ విచారించి మొత్తంమీద అసలు పుట్టిన తేదీలను తవ్వి తీశారు. అనంతరం వాటిని కోర్టుముందు ఉంచారు. నిందితుల బెయిల్ రద్దు చేయాలని అప్పీల్ చేశారు. వీటిని పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో చివరకు పోలీసులు కూడా బాధిత బాలిక తండ్రి సమర్పించిన పత్రాలు సరైనవని ధృవీకరిస్తూ తమ నివేదికను కోర్టులో సమర్పించారు.

కోర్టు ఆదేశాల మేరకు విచారణ జరిపి నివేదిక సమర్పించామని, మిగిలిన వ్యవహారం కోర్టు చేతిలో ఉందని చండీగఢ్‌ పోలీసులు తెలిపారు. ఇది ఇలా ఉంటే ఈ కేసులో ఒక నిందితుని బర్త్‌ సర్టిఫికెట్‌ను ఆరోగ్య శాఖ రద్దు చేసింది. ఈ కేసులో, అతని తండ్రి, మరో ఇద్దరిపై హిజార్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదయ్యాయి. మరో ఇద్దరు నిందితులపై దర్యాప్తు ఇంకా జరుగుతోంది. దీంతో నిందితుల్లో ఒకరికి వ్యతిరేకంగా ఆయన చేసిన వాదన నిజమని తేలింది. 

కరోనా మహమ్మారి కారణంగా కోర్టు విచారణ నిలిచిపోయిన కారణంగా న్యాయం చేయాలంటూ ఆయన ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్‌కు కూడా లేఖ రాశారు. అయితే ఇంకా స్పందన రాలేదని పేర్కొన్నారు. లైంగిక వేధింపుల నిందితులకు చట్టపరమైన మద్దతు ఇవ్వడంతోపాటు బెయిల్ బాండ్లను చెల్లించి చండీగఢ్‌ లాన్ టెన్నిస్ అసోసియేషన్ నిందితులకు వత్తాసు పలికిందని తండ్రి ఆరోపించారు. ఎప్పటికైనా న్యాయం జరిగి తీరుతుందనీ,  మిగిలిన ఇద్దరి విషయంలో నిజాలు నిగ్గు తేలతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఈ విషయం కోర్టులో ఉన్న కారణంగా స్పందించడానికి  టెన్నిస్‌ అసోసియేషన్‌ నిరాకరించింది.

Read latest Advt News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top