6 సంవత్సరాలు..800 కోట్లు! 

CCS police asked Nowhera Shaik for Custody - Sakshi

అమాంతం పెరిగిన హీరా గ్రూప్‌ టర్నోవర్‌ ఇది 

నగదు రాకపోకలపై సరైన పత్రాలు లేని వైనం 

హవాలా, అసాంఘిక కోణాలపై ప్రత్యేక దృష్టి.. అరెస్టుపై ఈడీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌కు సమాచారం 

కస్టడీ కోరిన సీసీఎస్‌ పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ టర్నోవర్‌ పెరుగుదల లెక్కలు తెలుసుకున్న సీసీఎస్‌ పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. మల్టీ నేషనల్‌ కంపెనీలకు సైతం లేని పెరుగుదల ఈ గ్రూప్‌లో కనిపించడంతో అవాక్కవుతున్నారు. దీనికి ఆ సంస్థ వద్ద, సీఈఓ నౌహీరా షేక్‌ వద్ద ఎలాంటి రికార్డులు లేకపోవడం గమనార్హం. సోమవారం ఢిల్లీలో అరెస్టు చేసి మంగళవారం నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. తదుపరి దర్యాప్తు నిమిత్తం 14 రోజులు తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సీసీఎస్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
 
అమాంతం పెరిగిన టర్నోవర్‌... 
నౌహీరాపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్‌ పోలీసులు అనేక మార్గాల్లో కీలక సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్‌ వార్షిక టర్నోవర్‌ ఆరేళ్లలో వందల రెట్లు పెరిగిం దని గుర్తించారు. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్‌ టర్నోవర్‌... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఆయా కంపెనీల లావాదేవీలు, వాటి డాక్యుమెంట్లను హీరా కనీసం ఐటీ విభాగానికీ, ఆర్వోసీకి సమర్పించలేదని పోలీసులు గుర్తించారు. అయినా నౌహీరా వ్యాపార సామ్రా జ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. తన మూడో భర్త తనను మోసం చేశారంటూ నౌహీరా చెప్పడం కలకలం సృష్టించింది.  

ఆయా విభాగాలకు సమాచారం... 
నౌహీరా అరెస్టుపై సీసీఎస్‌ పోలీసులు ఆదాయపుపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీస్‌ తదితర విభాగాలకు సమాచారం ఇస్తున్నారు. విదేశాల్లోనూ శాఖలున్న హీరా గ్రూప్‌పై మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఇప్పటికే ఓ కేసు నమోదు చేసింది. 

దిగువ మధ్యతరగతి నేపథ్యం...
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి చెందిన నౌహీరా షేక్‌ తండ్రి సాధారణ కూరగాయల వ్యాపారి. ఈమె మాజీ భర్త సైతం ఇదే వ్యాపారం చేసే వారని తెలిసింది. కేవలం పదో తరగతి మాత్రమే చదివిన నౌహీరా ప్రస్తుతం తన పేరుకు ముందు ‘డాక్టర్‌’ను తగిలించుకున్నారు. ఈ డాక్టరేట్‌ ఈమెకు దుబాయ్‌కు చెందిన ఓ వర్శిటీ ఇచ్చిందంటూ అనుచరులు ప్రచారం చేస్తున్నా.. పోలీసులు మాత్రం విశ్వసించడం లేదు. సదరు డాక్టరేట్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, నౌహీరా నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదని చెప్తున్నారు. భర్తతో వేరుపడిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన నౌహీరా బంజారాహిల్స్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో కొన్ని చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఈమె 2010–11లో హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరానే నేతృత్వం వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అహ్మదాబాద్‌లోని బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు నౌహీరా కొన్ని పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. వీటిలో తన హోదాను హీరా గ్రూప్‌ సీఈఓగా మాత్రమే కాకుండా ఇండియా ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ సెక్రటరీగా పేర్కొన్నారు. దీనిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.  

బంగారం వ్యాపారమని చెప్తున్నా... 
నౌహీరాను అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా హీరా గ్రూప్‌ లావాదేవీలను కోరారు. ఎంత మంది నుంచి డిపాజిట్లు సేకరించారు? వారు ఎక్కడెక్కడి వారు? ఎందరికి తిరిగి చెల్లించారు? ఇంకా ఎంత మందికి డబ్బు ఇవ్వాలి? లాంటి సమాచారంతో కూడిన రికార్డులు సమర్పించాల్సిందిగా కోరారు. అయితే ఆ వివరాలు తమ వద్ద లేవని కొన్ని ఆదాయపు పన్ను శాఖ, మరికొన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వద్ద ఉన్నాయంటూ సమాధానమిచ్చారు. కేవలం డిపాజిట్లు సేకరించడమే కాకుండా తన గ్రూప్‌ బంగారం వ్యాపారం సైతం చేస్తుందంటూ చెప్పిన నౌహీరా అందులోనే భారీ టర్నోవర్‌ పొందామని చెప్తున్నారు. సరాసరిన కేజీ బంగారం రూ.30 లక్షలకు ఖరీదు చేసి రూ.60 లక్షలకు విక్రయించిందని భావించినా... పెరిగిన టర్నోవర్‌ ప్రకారం చూస్తే ఏడాదికి కొన్ని టన్నుల వ్యాపారం చేయాలని, అది అసాధ్యమని పోలీసులు చెప్తున్నారు. మరోపక్క ఈ బిజినెస్‌కు సంబంధించి రికార్డులు సైతం ఈమె వద్ద లేవు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top