రేపిస్టులకు కఠిన శిక్షలు విధిస్తున్న దేశాలివే!

Capital Punishment For Molestation Cases in Different Countries - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దిశ’పై ఘోరంగా అత్యాచారం జరిపి క్రూరంగా హత్య చేయడంతో నేరస్థులను బహిరంగంగా ఉరితీయాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలే  కాకుండా సామాన్యుడి నుంచి సామాజిక కార్యకర్త వరకు నేడు డిమాండ్‌ చేస్తున్నారు. రేప్‌ కేసులకు సంబంధించి ప్రపంచంలోని ఇతర దేశాల్లో కఠిన శిక్షలు అమలు చేస్తున్నాయి ? వాటి వల్ల ఎంత మేరకు ప్రయోజనం ఉంది ? అన్న అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తించిన 195 దేశాల్లో పది దేశాల్లో రేప్‌ కేసులకు కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. షరియా చట్టాలు అమలు చేస్తున్న ఇస్లామిక్‌ దేశాల్లో కఠిన శిక్షలు ఎక్కువగా ఉన్నాయి.

సౌదీ అరేబియాలో
ఒకప్పుడు రేప్‌ కేసుల్లో నేరస్థులను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేవారు. దీన్ని ‘ఎక్జిక్యూషన్‌ త్రో స్టోన్స్‌’ అని వ్యవహరించేవారు. చచ్చేవరకు నేరస్థుడు బాధ అనుభవించాలనే ఇస్లాం మతం ప్రకారం ఈ శిక్షను అమలు చేసేవారు. ఆ తర్వాత బహిరంగంగా తల నరికి చంపెవారు. ఇప్పుడు అక్కడ కూడా ఇలాంటి క్రూర శిక్షలను విధించడం లేదు. బహిరంగంగా 80 నుంచి వెయ్యి వరకు కొరడా దెబ్బలు, ఆ తర్వాత పదేళ్ల వరకు జైలు శిక్షలను అమలు చేస్తున్నారు. వివాహేతర సంబంధాల విషయంలో మగవాళ్లతోపాటు ఆడవాళ్లకు బహిరంగ కొరడా శిక్షలను అమలు చేస్తారు. వాటిని కనిపెట్టడానికి మతపరంగా ‘రహస్య పోలీసులు’ ఉంటారు.

ఇరాన్‌లో ఉరి
ఇస్లామిక్‌ దేశమైన ఇరాన్‌లో పలు నేరాలతోపాటు రేప్‌ కేసుల్లో ఉరి శిక్షలను అమలు చేస్తున్నారు. ఆ దేశంలో ఉరి శిక్షలు పడుతున్న కేసుల్లో పది నుంచి పదిహేను శాతం రేప్‌కు సంబంధించిన కేసులే ఉంటున్నాయి. రేప్‌ కేసుల్లో బాధితులు నష్టపరిహారం తీసుకొని నేరస్థులను క్షమించవచ్చు. అలాంటి కేసుల్లో వంద వరకు కొరడా దెబ్బలు, కొన్ని సందర్భాలో సాధారణ జైలు శిక్షలను విధిస్తున్నారు.

ఈజిప్టు, యుఏఈ, అఫ్ఘాన్‌లలో మరణ శిక్షలు
ఈజిప్టుతోపాటు యూఏఈ దేశాల్లో రేప్‌ కేసుల్లో ఉరి శిక్షలు  అమలు చేస్తున్నారు. దుబాయ్‌లో నేరస్థులను పట్టుకున్న ఏడు రోజుల్లో ఉరి తీస్తారు. అఫ్ఘనిస్థాన్‌లో రేప్‌ కేసుల్లో నేరస్థులను తుపాకీతో తలలో కాల్చి చంపుతారు. పట్టుకున్న నాలుగు రోజుల్లోనే ఈ శిక్షను అమలు చేస్తున్నారు.

ఇజ్రాయిల్‌లో
కనిష్టంగా నాలుగేళ్లు, గరిష్టంగా 16 ఏళ్ల విధిస్తున్నారు. ఇది వరకు బాధితురాలిని పెళ్లి చేసుకునే అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కువగా జైలు శిక్షలే విధిస్తున్నారు.

చైనాలో
భారీ అవినీతి, కొన్ని రేప్‌ కేసుల్లో  మాత్రమే మరణ శిక్షలు అమలు చేస్తున్నారు. గతంలో ఓ గ్యాంగ్‌ రేప్‌ కేసులో నలుగురికి మరణ శిక్ష అమలు చేసిన అనంతరం వారు నిర్దోషులని తేలడంతో అప్పటి నుంచి నేరం తీవ్రతనుబట్టి ఆచితూచి మరణ శిక్షలు విధిస్తున్నారు.

రష్యాలో
రేప్‌ కేసుల్లో మూడు నుంచి ఆరేళ్లు జైలు శిక్షలు విధిస్తున్నారు. బాధితులు 18 ఏళ్ల లోపు వారైతే నేరస్థులకు నాలుగు నుంచి పదేళ్ల వరకు శిక్షలు పెరుగుతాయి. రేప్‌ కారణంగా బాధితురాలు మరణిస్తే 8 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష పెరుగుతుంది. అదే చనిపోయిన బాధితురాలు 14 ఏళ్ల లోపు మైనరైతే 12 నుంచి 15 ఏళ్ల వరకు శిక్ష పెరుగుతుంది.

నెదర్లాండ్స్‌లో
రేప్‌లే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడిన, అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నా రేప్‌ కేసుగానే పరిగణిస్తారు. నాలుగేళ్ల నుంచి 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. బాధితురాలు మరణించిన పక్షంలో 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తారు. వేశ్యలను వేధించినా నాలుగేళ్ల వరకు జైలు శిక్షలు పడతాయి.

ఫ్రాన్స్‌లో
రేప్‌ కేసుల్లో 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 15 ఏళ్లలోపు మైనర్లు బాధితులైతే 20 ఏళ్ల వరకు శిక్ష విధిస్తారు. బాధితురాలు తీవ్రంగా గాయపడినా, మరణించినా 30 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధిస్తారు. కఠిన శిక్షలు విధించడం వల్ల ఏ దేశంలోనూ పెద్దగా రేప్‌ కేసులు తగ్గడం లేదు. మరణ శిక్షలు విధించడం వల్ల సాక్ష్యాధారాలు లేకుండా చేయడంలో భాగంగా బాధితులను హత్య చేస్తున్నారని సామాజిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘దిశ’ హత్య కూడా అందులో భాగంగానే జరిగింది. మహిళలకు సరైన భద్రతను కల్పించడంతోపాటు ఆకతాయులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకరావడం వల్లనే రేప్‌ సంఘటనలను అదుపు చేయవచ్చని సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top