వివాహేతర సంబంధమే ఊపిరి తీసింది.. !

The Brutal Murder Of A Person With Fornication - Sakshi

మద్యం తాగించి ఇనుపరాడ్డుతో కొట్టి దారుణ హత్య

మరో హత్యకు పథకం

భగ్నం చేసిన పోలీసులు

విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ 

సాక్షి, ఒంగోలు: తనతో వివాహేతర సంబంధం కలిగి ఉన్న మహిళతో  మరో ఇద్దరు సంబంధం కలిగి ఉన్నారనే నెపంతో ఒకరిని దారుణంగా హతమార్చి మరో వ్యక్తి హత్యకు పన్నిన కుట్రను భగ్నం చేసి నిందితులను అరెస్టు చేశామని ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌ తెలిపారు. స్థానిక రూరల్‌ సీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు పూర్వాపరాలను ఆయన వివరించారు. డీఎస్పీ కథన, ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

ముగ్గురూ స్నేహితులే..
కొత్తపట్నం మండలం ఈతముక్కలకు చెందిన షేక్‌ అబ్దుల్‌ నిస్సార్‌ తన ఇద్దరు భార్యలను, ఒక కుమార్తెను దారుణంగా పెట్రోలు పోసి చంపేసిన కేసులో నిందితుడు. కేసు అనంతరం ఆయన సింగరాయకొండలో పండు రెస్టారెంట్‌ ఎదురుగా మెకానిక్‌ షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇతని వద్ద ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్‌ జిలానీ మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి ఒక మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే విధంగా మర్రిపూడి మండలం జువ్విగుంటకు చెందిన  దేవరపల్లి మాధవరెడ్డి(35)తో పరిచయం ఏర్పడింది. మాధవరెడ్డి ఇసుక వ్యాపారం చేస్తూ దుర్వసనాలకులోనై అప్పుల పాలయ్యాడు. ముగ్గురి మధ్య పరిచయం ఉన్నా తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో మాధవరెడ్డి కూడా  సంబంధం కొనసాగిస్తున్నాడనే అనుమానం అబ్దుల్‌ నిస్సార్‌కు కలిగింది. అంతే కాకుండా ఆమె ద్వారా వ్యభిచార వృత్తి కూడా నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లుగా భావించాడు. ఈ క్రమంలోనే నిస్సార్‌ వేధింపులు తట్టుకోలేక మహిళ ఆ గ్రామం విడిచి పెట్టింది.

ఆమె గ్రామం నుంచి వెళ్లిపోవడానికి మాధవరెడ్డి, అతని స్నేహితుడు టంగుటూరుకు చెందిన రాజుగా నిర్థారించుకున్న నిస్సార్‌ ఇద్దరిని ఎలాగైనా కడతేర్చాలని ప్లాన్‌చేశాడు. అందులో భాగంగా ఈ నెల 27న మాధవరెడ్డికి ఫోన్‌చేసి మందు పార్టీకి ఆహ్వానించాడు. తన షాపులో ఫూటుగా మద్యం తాగించిన అనంతరం తన సహాయకుడైన జిలానీతో కలిసి ఇనుపరాడ్‌తో, వాటర్‌ బాటిల్‌తో తలపై బలంగా మోదాడు. మెడకు వైరు బిగించి చంపేశారు. అనంతరం రిపేరుకోసం తన వద్దకు వచ్చిన  కారులో మాధవరెడ్డి మృతదేహాన్ని వేసుకొని కె.బిట్రగుంట గ్రామ అప్రోచ్‌ రోడ్డు మార్జిన్‌లో పడవేయడంతో పాటు మాధవరెడ్డి వినియోగించే మోటారు సైకిల్‌ను కూడా స్టాండు వేసి మృతదేహం పక్కనే ఉంచారు. తరువాత వారు  కారులో పరారై చినగంజాం రైల్వేస్టేషన్‌లో వదిలేసి పారిపోయాడు. ఉదయాన్నే ఈ వ్యవహారం వెలుగు చూడడంతో కలకలం రేగడం, మృతుని సోదరుడైన సుబ్బారెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనాస్థలం నుంచి మాధవరెడ్డి జేబులోని పాకెట్‌ బుక్‌ను, అందులో ఉన్న మహిళ ఫొటో సాయంతో దర్యాప్తు ముమ్మరం చేయడంతో నిందితులు ఎవరనేది స్పష్టమైంది.

మరో హత్యకు కుట్ర
మాధవరెడ్డిని హత్యచేసిన అనంతరం నిస్సార్‌ టంగుటూరు మండలానికి చెందిన రాజును కూడా హతమార్చి అనంతరం పోలీసులకు లొంగిపోవాలని భావించినట్లు సమాచారం. దీంతో ఒంగోలు రూరల్‌ సీఐ , సింగరాయకొండ ఇన్‌చార్జి సీఐ పి.సుబ్బారావు, జరుగుమల్లి ఎస్సై కమలాకర్, కొండపి ఎస్సై ఎన్‌సీ ప్రసాద్, కానిస్టేబుళ్లు శివ, అంకమ్మరావు, కిషోర్, ఐటీ కోర్‌టీం సిబ్బంది ఎప్పటికప్పుడు నిందితుల కదలికలపై దృష్టిసారించి బుధవారం కె.బిట్రగుంట బస్టాండ్‌ వద్దకు చేరుకున్న ఇరువురిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ కేవీవీ ప్రసాద్‌ తెలిపారు. సకాలంలో నిందితులను అరెస్టు చేయడం వల్ల మరో హత్య జరగకుండా కాపాడగలిగామన్నారు. ఈ కేసును చేధించడంలో కృషిచేసిన వారందరికీ నగదు రివార్డులు అందించేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ తనను ఆదేశించారని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసేందుకు కృషిచేసిన సిబ్బందిని ప్రశంసించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top