దొంగలు రైల్లో.. పోలీసులు విమానంలో..

Bihari Gang Arrest in Hyderabad - Sakshi

బీహారీ దొంగల ముఠా పట్టివేత

36 గంటల్లోనే కుషాయిగూడ జ్యూవెల్లరీ చోరీ కేసు ఛేదన

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులు దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కినట్లు గుర్తింపు

వారం క్రితం బీహార్‌లో నలుగురి అరెస్టు, తాజాగా మరో ఇద్దరి పట్టివేత

సాక్షి, సిటీబ్యూరో:  కుషాయిగూడలోని వినాయక జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీ కేసులో వారం క్రితం నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకున్న రాచకొండ పోలీసులు బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. జ్యూవెల్లరీ షాప్‌ మొదలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వరకు ఉన్న సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితులు బీహర్‌కు వెళ్లే రైలు ఎక్కినట్లు గుర్తించిన పోలీసులు అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారం క్రితం దానాపూర్‌ రైల్వేస్టేషన్‌లో చిక్కిన ముఠా ఇచ్చిన వివరాల ఆధారంగా కుషాయిగూడలో బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరి నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు. 

మరో రెండు కేసుల్లోనూ ప్రమేయం ...
ఈ నెల 4న తెల్లవారుజామున ఐదుగురు బీహారీ దొంగల  ముఠా కుషాయిగూడ, ఏఎస్‌రావు నగర్‌లోని వినాయక జ్యూవెల్లరీ దుకాణంలో చోరీకి పాల్పడింది. వీరిలో నలుగురు ఓ గోడకు రంధ్రం చేసుకొని షాపులోపలికి వెళ్లగా మరో వ్యక్తి ఆటోలో బయట వేచిఉన్నాడు. అయితే నిర్వాహకులు దుకాణంలోని సీసీటీవీ కెమెరాలతో పాటు అలారమ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేశారు. సెల్‌ఫోన్‌లో అలారమ్‌ మోగడంతో అప్రమత్తమైన యజమాని వెంటనే సెల్‌ఫోన్‌ నుంచి సీసీటీవీలను పర్యవేక్షిస్తే పనిచేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతను భార్యతో కలిసి దుకాణం వద్దకు చేరుకొని బయటి నుంచి కేకలు వేయడంతో లోపల ఉన్న దొంగలు  తాము మూటగట్టిన బంగారు, వెండి ఆభరణాలను అక్కడే వదిలేసి 7 తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఆటోలో పరారయ్యారు. దీనిపై సమాచారం అందడంతో అప్రమత్తమైన కుషాయిగూడ, సీసీఎస్‌ పోలీసులు ఆ మార్గంలోని సీసీటీవీలను పరిశీలించగా వారు దమ్మాయిగూడలో మకాం వేసినట్లు గుర్తించారు.

అక్కడికి వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు దొంగలు రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్టుగా సమాచారం అందడంతో  సీసీఎస్‌ పోలీసులను అక్కడికి పంపారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా పాట్నాకు వెళ్లే దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కినట్టుగా గుర్తించారు. దీంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం విమానంలో పాట్నాకు బయలుదేరి వెళ్లింది. బీహర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో దానాపూర్‌ రైల్వేస్టేషన్‌లో నిఘా ఏర్పాటు చేశారు. నిందితులు రైలు దిగేలోగా రాచకొండ పోలీసులు అక్కడికి చేరుకొని మహమ్మద్‌ షాబాజ్‌ అలమ్, మహమ్మద్‌ షాహీద్, మహమ్మద్‌ మంజూర్‌ అలమ్, మహమ్మద్‌ ఖాసీమ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా మరో ఇద్దరు నిందితులు అల్తబ్‌ అలమ్, మెహందీ అజీమ్‌ ఈ నెల 10న కుషాయిగూడలోని మోహన్‌లాల్‌ చౌదరి బేకర్స్‌ అండ్‌ జ్యూవెల్లరీ వద్ద పట్టుకున్నారు. నిందితులను విచారించగా కుషాయిగూడతో పాటు కీసర, జవహర్‌నగర్‌ ఠాణాల పరిధిల్లోనూ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు.

ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ..
బీహర్‌కు చెందిన అల్తబ్‌ అలమ్‌ మూడేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం బంధువుల సహకారంతో మూడేళ్ల క్రితం కుషాయిగూడకు వలస వచ్చి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం ఆటోట్రాలీ కొనుగోలు చేసిన అతడికి సొంతూరుకు వెళ్లిన సమయంలో మహమ్మద్‌ షాబాజ్‌ అలమ్‌తో పరిచయం ఏర్పడింది. వారు చోరీల విషయం చెప్పడంతో తనకు తెలిసిన జ్యువెల్లరీ షాప్‌లు, హోటల్స్‌ వివరాలు చెప్పాడు. 15 రోజుల క్రితం ఆరుగురితో కలిసి మహమ్మద్‌ షాబాజ్‌ అలమ్‌ దమ్మాయిగూడలోని ఓ గదిలో అద్దెకు దిగారు. మూడు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ తెలిపారు. మహమ్మద్‌ షాబాజ్‌ అలమ్‌పై బీహర్‌లో మూడు కేసులు ఉన్నాయని, అతడికి క్రిమినల్‌ చరిత్ర ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.11,49,160 విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top