పెళ్లి పేరుతో మోసం

Air Hostess Cheating Case File on Saudi Man - Sakshi

సౌదీ యువకుడి అరెస్టు  

బంజారాహిల్స్‌: పెళ్లి చేసుకుంటానని ఎయిర్‌హోస్టెస్‌ను నమ్మించి నాలుగేళ్లు సహజీవనం చేసి ఆమె నుంచి రూ.లక్షలు తీసుకుని తీరా పెళ్లి మాట ఎత్తేసరికి మొహం చాటేసిన విదేశీ యువకుడిని బంజారాహిల్స్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీ, ఆర్కేపురం, మహ్మద్‌పూర్‌ ప్రాంతానికి చెందిన యువతి సౌదీలోని రియాద్‌లో ఉంటూ సౌదీ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. 2015 మార్చిలో దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా విమానంలో రియాద్‌కు చెందిన  అలీ–అల్‌–ఖఫియా సాలెం అలీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనను యమన్‌ దేశస్తుడిగా పరిచయం చేసుకున్న అతను రియాద్‌లో ఉంటానని హైదరాబాద్‌లోని  ఫరా ఇంజినీరింగ్‌ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నట్లు చెప్పాడు. పారామౌంట్‌ కాలనీలో ఉంటూ కాలేజీకి వెళుతున్నట్లు చెప్పాడు. వీరిద్దరి పరిచయం స్నేహానికి ఆ తరువాత ప్రేమకు దారితీసింది.

తరచూ ఇద్దరూ కలుసుకునేవారు. పెళ్లి చేసుకుంటానని సాలెం చెప్పడంతో ఇద్దరూ పారామౌంట్‌ కాలనీలోని అతడి ఇంట్లోనే సహజీవనం చేశారు. నాలుగేళ్లుగా సాలెం ఆమె నుంచి పలుదపాలుగా రూ.15 లక్షల వరకు తీసుకున్నాడు. ఈ నెల 6న విమానంలో రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో పెళ్లి విషయమై చర్చజరిగింది. అయితే తనకు పెళ్లిచేసుకునే ఉద్దేశం  లేదని చెప్పాడు. తాను ఇండియాకు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్‌కు వచ్చి నాలుగైదు రోజులపాటు సాలెంతోనే ఉండేదానినని అతను తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాలెం కోసం గాలింపు చేపట్టగా ఇంటికి తాళంవేసి పరారయ్యాడు. నాలుగురోజులుగా హైదరాబాద్‌లోనే తిష్టవేసిన బాధితురాలు సాలెం ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చేపట్టింది. నిందితుడు తరచూ బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌కు వస్తాడని తెలియడంతో రెండు రోజులుగా అక్కడే మాటు వేసింది. ఈ నెల 22న సాలెం సదరు పబ్‌కు రావడాన్ని గుర్తించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సాలెంపై చీటింగ్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top