పుదుచ్చేరిలో నకిలీ ఏటీఎం ముఠా అరెస్ట్‌

AINRC worker arrested in multi-crore ATM fraud case - Sakshi

సాక్షి, చెన్నై: పుదుచ్చేరి కేంద్రంగా నకిలీ ఏటీఎం కార్డుల్ని తయారుచేస్తున్న ముఠా సభ్యుల్ని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా సామాన్యుల నుంచి కొల్లగొట్టిన మొత్తం రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ముఠాలో పుదుచ్చేరికి చెందిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్, అన్నాడీఎంకే నేతలు ఉండటం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కేరళలోని ఓ పబ్‌లో గతవారం చోటుచేసుకున్న ఓ గొడవలో పుదుచ్చేరికి చెందిన ఓ యువకుడి వద్ద భారీ సంఖ్యలో నకిలీ ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. దీంతో పుదుచ్చేరి పోలీసుల సహకారంతో కేరళ పోలీసులు రహస్య విచారణ చేపట్టారు.

అనంతరం ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగి జయచంద్రన్, డా.ఆనంద్, చెన్నైకు చెందిన శ్యామ్, కమల్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత సత్య, అన్నాడీఎంకే నేత చంద్రోజీలు ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాల సాయంతో బ్యాంక్‌ ఖాతాల్లోని నంబర్లను ట్రాప్‌చేసి నకిలీ ఏటీఎం కార్డుల్ని సృష్టించేవారని పోలీసులు తెలిపారు. అలాగే స్వైపింగ్‌ యంత్రాలు వాడే షాపు యజమానులతో చేతులు కలిపి ఖాతాదారుల వివరాలు తస్కరించేవారని, ఇందుకోసం 10 శాతం కమీషన్లు ఇచ్చేవారన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top