యాక్టివా ‘లాక్‌’ చాలా ఈజీ!

activa thief arrest in hyderabad - Sakshi

ఆ వాహనాలనే చోరీ చేస్తున్న దొంగ

ఇప్పటికి ఐదు బైక్‌లు చోరీ

నిందితుడి అరెస్టు

సాక్షి, సిటీబ్యూరో: ‘ఒంగోలులో ఉన్నప్పుడు కొన్నాళ్ళ పాటు యాక్టివా వాడాను సార్‌. డూబ్లికేట్‌ లాక్‌తో దాన్ని ఓపెన్‌ చేయడం చాలా ఈజీ. అందుకే ఆ బళ్లే దొంగతనం చేయడం ప్రారంభించా’.. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసిన వాహన దొంగ సాంబశివ అధికారులతో చెప్పిన మాటలివి. ఈ చోరుడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం వెల్లడించారు.   ప్రకాశం జిల్లా, కల్లవల్లకు చెందిన పారా సాంబశివరావు కొన్నాళ్ళ పాటు నెల్లూరులో వ్యాపారం చేసి నష్టాలు రావడంతో కుటుంబంతో సహా  2015లో హైదరాబాద్‌కు వలసవచ్చి బోయిన్‌పల్లి ప్రాంతంలో ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఇతను తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు వాహన దొంగగా మారాడు. ఒంగోలులో హోండా యాక్టివా వాహనం వినియోగించిన ఇతగాడు దాన్ని హ్యాండిల్‌ లాక్‌ను మారు తాళంతో తెరవటం తేలికని గుర్తించాడు. దీంతో ఆ వాహనాలనే టార్గెట్‌గా చేసుకున్నాడు.

నకిలీ తాళాల గుత్తితో సంచరించే ఇతగాడు పార్కింగ్‌ ప్రాంతాల్లో ఉన్న హోండా యాక్టివ వాహనాలను చోరీ చేస్తాడు. వీటిని సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో విక్రయించగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తాడు. గతంలో వాహన చోరీ చేసిన కేసులో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత అదే పంథా కొనసాగించాడు. పేట్‌ బషీరాబాద్, బోయిన్‌పల్లి, సనత్‌నగర్‌ పరిధుల నుంచి మూడు వాహనాలు చోరీ చేశాడు. ఓ సందర్భంలో పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు తమ పరిధిలో నమోదైన కేసులో అరెస్టు చేశారు. అప్పట్లో మిగిలిన రెండు చోరీల విషయం అతగాడు బయటపెట్టలేదు. దీంతో ఒక్క కేసులోనే అరెస్టైన శివ బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆతర్వాత అల్వాల్‌ పరిధి నుంచి మరో యాక్టివా చోరీ చేశాడు. బుధవారం బోయిన్‌పల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇతడిని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు ఆదేశాల మేరకు ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్, కేఎస్‌ రవి, కె.శ్రీకాంత్‌ తమ బృందాలతో వలపన్ని పట్టుకున్నారు. ఇతడి నుంచి మూడు యాక్టివ వాహనాలను స్వాధీనం చేసుకుని త దుపరి చర్యల నిమిత్తం బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top