హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ డైరెక్టర్‌పై ఏసీబీ దాడులు

ACB attacks on HMDA Planning Director - Sakshi

     ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండోసారి...

     రూ. 5.35 కోట్ల ఆస్తుల గుర్తింపు.. మార్కెట్‌ విలువ రూ.25 కోట్లు

     పురుషోత్తమ్‌రెడ్డి, అతడి బావమరిది ఇళ్లు సీజ్‌ చేసిన ఏసీబీ

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్లానింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కట్టా పురుషోత్తమ్‌రెడ్డి ఇంటిపై శుక్రవారం ఏసీబీ దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీ, సాగర్‌ సొసైటీ, ఆయన కార్యాలయంతో పాటు మరో తొమ్మిది ప్రాంతాలు, బంధువుల ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.5.35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వీటికి సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.25 కోట్లకుపైగా ఉంటుందని ఏసీబీ పేర్కొంది. 1985లో బిల్డింగ్‌ సూపర్‌వైజర్‌గా ఉద్యోగంలో చేరిన పురుషోత్తమ్‌రెడ్డి ప్రస్తుతం డైరెక్టర్‌ హోదాలో పనిచేస్తున్నారు. గతంలో 2009లోనూ పురుషోత్తమ్‌రెడ్డిపై ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఆ సమయంలో రూ.3.7 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పూర్ణచందర్‌రావు ఓ ప్రకటనలో తెలిపారు.  

పరారీలో పురుషోత్తమ్‌రెడ్డి 
పురుషోత్తమ్‌రెడ్డి నెల రోజుల నుంచి సెలవులో ఉన్నట్టు తెలిసింది. దాడుల సందర్భంగా సాగర్‌ సొసైటీలోని మరో ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు తాళం వేసి ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఆ ఇంటిని సీజ్‌ చేసి, ఆ మేరకు ఉత్తర్వులను ఇంటి తలుపులకు అంటించారు. అదే విధంగా పురుషోత్తమ్‌రెడ్డికి బినామీగా ఉన్న ఆయన బావమరిది ఇళ్లు సైతం తాళం వేసి ఉండటంతో ఆ ఇళ్లను సైతం సీజ్‌ చేసినట్టు ఏసీబీ డీజీ తెలిపారు. ప్రస్తుతం పురుషోత్తమ్‌రెడ్డితో పాటు ఆయన బావమరిది శ్రీనివాస్‌రెడ్డి పరారీలో ఉన్నారని, వారు దొరకగానే వీరి ఇళ్లను తెరిచి మరోసారి సోదాలు నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.  

మరో ఇద్దరిపైనా డీఏ కేసులు నమోదు... 
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్, కరీంనగర్‌ ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డిపై కూడా కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ పూర్ణచందర్‌రావు మరో పత్రికా ప్రకటనలో తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top