క్లాస్‌ లీడర్‌ కాలేదని..

8th Class Student Committed Suicide In Yadadri District - Sakshi

రైలు కింద పడి 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన

రామన్నపేట: ఓటమిని అంగీకరించలేని మనస్తత్వం... ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ముందుకెళ్లాలనే జీవితసూత్రం తెలియని ఓ టీనేజీ విద్యా కుసుమం రాలిపోయింది. చదువులో మేటిగా నిలిచినా కేవలం ఓ పోటీలో ఓడిపోయాననే మనోవేదనతో ఓ విద్యార్థి అర్ధంతరంగా తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే పోలీసులు, మృతుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేటలోని కొమ్మాయిగూడెం రోడ్డులో నివాసం ఉంటున్న చిందం విజయ్‌ కుమార్, విజయలక్ష్మిలకు ఇద్దరు కుమారులు. విజయ్‌ కుమార్‌ రామన్నపేట బస్టాండ్‌ ఎదురుగా కిరాణా షాప్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రెండో కుమారుడైన చిందం చరణ్‌ కుమార్‌ (13) స్థానిక కృష్ణవేణి హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు.

గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా స్కూల్‌ లీడర్, క్లాస్‌ రిప్రజెంటేటివ్‌ (లీడర్‌), గర్ల్స్‌ లీడర్‌ పదవులకు మూడు రోజుల కిందట ఎన్నికలు నిర్వహించారు. క్లాస్‌ రిప్రజెంటేటివ్‌ బరిలో చరణ్‌ నిలవగా అతనికి పోటీగా మరో విద్యార్థిని నిలిచింది. ఈ నెల 16న మోడల్‌ ఎన్నికలు జరిగాయి. ఫలితాల్లో అతను ద్వితీయ స్థానంలో నిలిచాడు. మొదటిస్థానం దక్కలేదని కొంత అసంతృప్తితో ఉన్నా అదే రోజు క్లాస్‌లో స్వీట్లు పంచినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. ఆ రోజు నుంచి అతను ముభావంగా ఉంటున్నాడు. రోజూ మాదిరిగానే ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు పాఠశాల నుంచి వచ్చిన చరణ్‌... బ్యాగ్‌ ఇంట్లో పెట్టి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతని ఆచూకీ కోసం తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికారు. ఆచూకీ దొరకకపోవడంతో అదే రోజు రాత్రి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో చరణ్‌ కనిపించడంలేదంటూ ఫిర్యాదు చేశారు. రాత్రంతా అతని కోసం వెతుకున్న తల్లిదండ్రులకు చుట్టుపక్కల వారి ద్వారా రైల్వేట్రాక్‌పై ఓ విద్యార్థి మృతదేహం ఉన్నట్లు తెలిసింది. అక్కడికి వెళ్లి చూడగా చరణ్‌ విగతజీవిగా పడి ఉన్నాడు. స్కూలు ఎన్నికల్లో ఓడిపోయాయనే బాధతో తన కుమారుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి విజయ్‌ కుమార్‌ రైల్వే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నల్లగొండ రైల్వే ఎస్‌ఐ టి.అచ్యుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.  

చురుకైన విద్యార్థి... 
చరణ్‌ కుమార్‌ పాఠశాలలో చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. చదువులో, క్రీడల్లో తమను ప్రోత్సహించేవాడని తోటి విద్యార్థులు తెలిపారు. పేద పిల్లలకు నోట్‌ పుస్తకాలు, ఆర్థిక సాయం కూడా చేసేవాడని పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే చరణ్‌ మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. తల్లిదండ్రుల రోదన అందరినీ కంటతడి పెట్టించింది. కాగా, చరణ్‌ కుటుంబ సభ్యులను నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శించారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఆయనవెంట సర్పంచ్‌లు గోదాసు శిరీషపృద్వీరాజ్, ఎడ్ల మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి ఎడ్ల నరేందర్‌రెడ్డి ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top