ఒక్క ట్వీట్‌తో 26 మంది బాలికలకు విముక్తి

26 Minor Girls Rescued After A Passenger Tweet To Railway Protection Force - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా పుణ్యమా అని 26 మంది మైనర్‌ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్‌ భద్రతా దళాలు సత్వరం రంగంలోకి దిగి బాలికలను రక్షించాయి. మజఫర్‌ నగర్‌-బాంద్రాల మధ్య నడిచే అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‘ఎస్‌ 5’ భోగిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి..  ‘పక్క భోగిలో దాదాపు 25 మంది బాలికలు ఉన్నారు. వారంతా ఏడుస్తూ.. భయం భయంగా దిక్కులు చూస్తున్నారు. బహుశా వారిని బలవంతంగా ఎక్కడికో తరస్తున్నార’ని రైల్వే భద్రతా దళానికి ట్వీట్‌ చేశాడు. 

సమాచారం అందుకున్న ఉన్నాతాధికారులు వెంటనే కాపతాన్‌గంజ్‌లో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులను రంగంలోకి దించారు. సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఇద్దరు ఆర్పీఎఫ్‌ జవాన్లు బాలికలు ఉన్న భోగిలో ప్రవేశించి గోరఖ్‌పూర్‌ వరకు కాపలాగా వెళ్లారు. అక్కడే మాటువేసిన మిగతా పోలీసులు బాలికలను రక్షించారు. వారిని బలవంతంగా తరలిస్తున్న  ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ ట్వీట్‌ అందిన 30 నిమిషాల్లో పూర్తవడం విశేషం.

26 మంది బాలికలను రక్షించామనీ, వారంతా బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. బాలికలను నర్‌కాథిక్యాగంజ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఈద్గా ప్రాంతానికి తరలిస్తున్నారని తెలిపారు. బాలికలు దగ్గర నుంచి మరిన్నివివరాలు తెలియాల్సి ఉందన్నారు. వారిని బాలికా సంరక్షణ కమిటీకి అప్పగించామన్నారు. పిల్లలంతా 10 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top