ప్రపంచ పరిణామాలే కీలకం

The world's evolution is crucial - Sakshi

ఫెడ్‌ సమావేశంపై అందరి దృష్టి 

వాణిజ్య యుద్ధాలపై ఆందోళన 

దేశీ రాజకీయ అంశాలకూ ప్రాధాన్యం 

ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనాలు ఇవి... 

వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ పరిణామాలే ఈ వారం మార్కెట్‌కు కీలకమని నిపుణులంటున్నారు. దేశీయ రాజకీయ అంశాలు, వాణిజ్య యుద్ధ భయాల ప్రభావం మన మార్కెట్‌పై తీవ్రంగానే ఉందని వారంటున్నారు. ఇక డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాలు కూడా ఈ వారం స్టాక్‌ మార్కెట్‌ గమనాన్ని నిర్దేశిస్తాయని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.  

ఫెడ్‌ ఏం చేస్తుందో ? 
రెండు రోజుల అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశం ఈ నెల 20(మంగళవారం) మొదలవుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటంతో ఈ సమావేశంలో రేట్లను పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మూడు సార్లు రేట్ల పెంపు ఉండొచ్చన్ని ఇప్పటికే ఫెడ్‌ సంకేతాలిచ్చింది. కంపెనీల క్యూ3 ఫలితాలు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నాయని సూచించాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి దీర్ఘకాలిక అంచనాలు పటిష్టంగా ఉన్నాయని వివరించారు. అయితే వాణిజ్య యుద్ధభయాలు, దేశీయంగా మొండి బకాయిల సమస్యలు, రానున్న కాలంలో జరిగే రాష్ట్రాల ఎన్నికలు మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

10,600 కోట్ల విదేశీ డెట్‌ పెట్టుబడులు వెనక్కి.. 
విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకూ మన ఈక్విటీ మార్కెట్లో రూ.6,400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. గత నెలలో భారీగా(రూ.11,000 కోట్ల మేర) ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పటికీ, టీసీఎస్‌ బ్లాక్‌డీల్‌ కారణంగా ఈ నెల 1–16తేదీల మధ్యకాలంలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్లస్‌లోకి వచ్చాయి. టాటా సన్స్‌ విక్రయించిన టీసీఎస్‌ షేర్ల ను బ్లాక్‌డీల్‌లో ఎఫ్‌పీఐలు కొనుగోలు చేసినందున ఈ స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు నియంత్రణ సంస్థ సెబీ డేటా తెలియపరుస్తున్నది. టీసీఎస్‌ షేర్ల కొనుగోళ్లు లేకపోతే, మన ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌పీఐలు నికర అమ్మకాలు రూ. 1000 కోట్లవరకూ ఈ నెలలో ఇప్పటివరకూ వున్నాయి. మరోవైపు విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటిదాకా డెట్‌ మార్కెట్‌ నుంచి రూ.10,600 కోట్ల మేర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. 

ఆరు  ఐపీఓలు... 
గత వారంలో ఆరంభమైన 2 కంపెనీల ఐపీఓలు ఈ వారంలో ముగుస్తున్నాయి. మరో 4  కంపెనీలు ఈ వారంలో ఐపీఓకు వస్తున్నాయి.  గత గురువారం మొదలైన బంధన్‌ బ్యాంక్‌ ఐపీఓ నేడు ముగుస్తోంది. రూ.370–375  ప్రైస్‌బాండ్‌తో   రూ.4,473 కోట్లు సమీకరించాలని ఈ బ్యాంక్‌ భావిస్తోంది. కనీసం 40 షేర్లకు దరఖాస్తు చేయాలి. గత శుక్రవారం ఆరంభమైన హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ ఐపీఓ రేపు (మంగళవారం) ముగుస్తోంది.  రూ. 1,215–1,240 ప్రైస్‌బాండ్‌తో ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ. 4,300 కోట్లు సమీకరించనున్నది. కనీసం 12 షేర్లకు దరఖాస్తు చేయాలి.  గత శుక్రవారమే మొదలైన కర్దా కన్‌స్రక్షన్స్‌ ఐపీఓ ఈ నెల 21న(బుధవారం) ముగియనున్నది. రూ.175–180 ప్రైస్‌బాండ్‌తో ఈ కంపెనీ రూ.77 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. సంధార్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ నేటి(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నది. రూ.327–332  ప్రైస్‌బాండ్‌ ఉన్న ఐపీఓ ఈ నెల 21న(బుధవారం)ముగుస్తుంది.  హైదరాబాద్‌కు చెందిన మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) ఐపీఓ ఈ నెల 21న(బుధవారం) మొదలై ఈ నెల 23న ముగుస్తుంది. రూ.87–90 ప్రైస్‌బాండ్‌తో ఈ కంపెనీ రూ.438 కోట్లు సమీకరించనుంది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఐపీఓ ఈ నెల 22న(గురువారం) మొదలై  26న ముగుస్తుంది. రూ.519–520 ప్రైస్‌బాండ్‌తో  రూ.4,000 కోట్ల మేర సమీకరించాలని యోచిస్తోంది. కనీసం 28 షేర్లకు దరఖాస్తు చేయాలి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top