మహిళలైతే మరొకలా.. | woman insult in startup company's | Sakshi
Sakshi News home page

మహిళలైతే మరొకలా..

Mar 8 2016 12:43 AM | Updated on Sep 3 2017 7:12 PM

మహిళలైతే మరొకలా..

మహిళలైతే మరొకలా..

ఇండియా నిండా ఇపుడు స్టార్టప్‌లే. వీటిలో మహిళలవీ ఎక్కువే. కానీ ఇక్కడా వివక్ష తప్పటం లేదు.

స్టార్టప్ ఇన్వెస్ట్‌మెంట్లలోనూ తప్పని వివక్ష
ఇండియా నిండా ఇపుడు స్టార్టప్‌లే. వీటిలో మహిళలవీ ఎక్కువే. కానీ ఇక్కడా వివక్ష తప్పటం లేదు. గతేడాది దేశీ స్టార్టప్‌లలోకి వచ్చిన నిధుల్లో కేవలం 4.2 శాతమే మహిళల కంపెనీల్లోకి వచ్చాయి. పెపైచ్చు వెంచర్ క్యాపిటలిస్టులు మహిళల్ని అడుగుతున్న ప్రశ్నలు చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. ఇలా... ఓ నలుగురు మహిళలకు ఎదురైన అనుభవాలు... ఈ ఉమెన్స్ డే ప్రత్యేకం...

సల్వార్ కమీజ్‌లో రావాల్సింది!
క్లవర్ కిడ్ సంస్థ... 2013లో ఢిల్లీలో ఆరంభమైంది. పిల్లలకు చదువుతో పాటు మ్యూజిక్, డ్యాన్స్, ఆర్ట్స్, ఆటలు అందించడమే దీని పని.
ఎదురైన అనుభవం: విస్తరణ కోసం నిధుల సమీకరణలో ఉండగా... ఒకరోజు రాత్రి అడ్వైజర్ నుంచి ఫోనొచ్చింది. రేపు ఏంజిల్ ఇన్వెస్టర్‌తో మీటింగ్ ఉంటుంది ప్రిపేరవమన్నాడు. ఫార్మల్ దుస్తులతో వెళ్లా. నన్ను చూడగానే...  ఓరి దేవుడా! మీకు సంప్రదాయ దుస్తులంటే తెలీదా? ఇలా ఫార్మల్‌లో కాకుండా సల్వార్ కమీజ్‌లో రావాల్సింది!! అన్నారా అడ్వైజర్. దానికి నేనేమన్నానో తెలుసా? మా విజ్ఞత, విజ్ఞానం, శక్తికి కొలమానం మా విలువలు, అనుభవాలే. మా దుస్తులు కావు... అని. - షభ్నం అగర్వాల్ (30), క్లవర్‌కిడ్

మీరు పెళ్లి చేసుకుంటారా!
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఫిట్ సర్కిల్... స్మార్ట్‌ఫోన్ల ద్వారా వ్యక్తిగత, కార్పొరేట్ బృందాలకు  ఫిట్‌నెస్ సలహాలిస్తుంది. ఈ సూచనల మేరకు ఉత్పత్తులనూ కొనుగోలు చేయొచ్చు.
ఎదురైన అనుభవం: ‘‘నన్ను వెంచర్ క్యాపిటలిస్టులు అడిగిన మొదటి ప్రశ్న... మీ కో-ఫౌండర్ నీ భర్తా? అని. రెండో ప్రశ్న... భార్య, భర్తలు కో-ఫౌండర్లుగా ఉన్న కంపెనీల్లో మేం పెట్టుబడులు పెట్టం’’ అని. ఎందుకంటే భవిష్యత్తులో విడాకులు తీసుకుంటే భారీ పరిహారం చెల్లించాల్సి ఉంటుందట!!. ఈ అనుభవంతో నేను చెప్పేదొక్కటే. ఇది ఇండియా. ఇక్కడి విధానం, విలువలు చాలా నమ్మకమైనవి. ప్రత్యేకమైనవి కూడా. దయచేసి విదేశీ నిబంధనలు, అలవాట్లను ఇక్కడి ప్రజలపై రుద్దకండి. - ఆర్తి గిల్ (28), ఫిట్ సర్కిల్, కో-ఫౌండర్.

 సహజీవనం చేస్తున్నావా!
2012లో ప్రారంభమైన లిటిల్ బ్లాక్ బుక్... ఢిల్లీ, గుర్గావ్, బెంగళూరులో సేవలందిస్తోంది. స్థానికంగా జరిగే లైఫ్ స్టైల్ ఈవెంట్లతో పాటు స్థానిక రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, ట్రావెల్స్ సమాచారం అందిస్తుంటుంది. ఇది బీబీసీతో కలసి పనిచేస్తోంది.
ఎదురైన అనుభవం: నేను నిధుల సేకరణకు వెళ్లినపుడు.... నువ్వు ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నావా? అని ఇన్వెస్టర్లు అడిగారు. నాకు కోపం వచ్చింది. కానీ, సహనాన్ని పరీక్షించేందుకే ఇలాంటి ప్రశ్నలడుగుతారని భావించి అణుచుకున్నా. వ్యక్తిగత జీవితం ప్రభావం వృత్తి పరమైన నిర్ణయాల మీద పడుతుందని అలా అడిగారట!!. నాకైతే వారు ఫండింగ్‌కు నో చెప్పటానికి చూపించిన కారణాలు చాలా సిల్లీగా అనిపించాయి. - సుచిత సల్వాన్, లిటిల్ బ్లాక్ బుక్, ఫౌండర్

 వ్యాపారం చేస్తే గర్భం వద్దా?
అంకితా సేఠ్, అమిత్ దామిని, ప్రణవ్ మహేశ్వరీ కలసి గతేడాది ముంబైలో... గెస్ట్‌హౌస్ అగ్రిగేటర్ ‘విస్టా రూమ్స్’ను ఆరంభించారు.
ఎదురైన అనుభవం: ఒకసారి ఇన్వెస్టర్లతో మాట్లాడినపుడు... నేను విస్టా రూమ్స్ ప్రతినిధినని, ఉత్పత్తులు, మార్కెటింగ్, విస్తరణ కో-ఫౌండర్లుగా ఉన్న మగవాళ్లు చూస్తున్నారని చెప్పారు. దీంతో వాళ్లు... ‘మీరు గర్భవతి ఎప్పుడవుతారు’ అని అడిగారు. వారి మాటలు, చూపులు చూసి... వెంటనే వారి ఇన్వెస్ట్‌మెంట్లు వద్దన్నాం. నేను చెప్పేదేంటంటే.. ఎక్కడైనా మహిళ తన ఇష్టంతోనో, బలవంతంగానో మాతృత్వం పొందుతుంది. కానీ అది తన వ్యాపార నిర్ణయాల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించదు.
                                      - అంకితా సేఠ్ (32), విస్టా రూమ్స్ కో-ఫౌండర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement