అసలెవరీ నీరవ్‌ మోదీ? | Who is Nirav Modi, billionaire linked to PNB fraudulent transactions worth Rs 10,000 crore? | Sakshi
Sakshi News home page

అసలెవరీ నీరవ్‌ మోదీ? పీఎన్‌బీ స్కాంతో లింకేంటి?

Feb 15 2018 9:06 AM | Updated on Feb 15 2018 9:19 AM

Who is Nirav Modi, billionaire linked to PNB fraudulent transactions worth Rs 10,000 crore? - Sakshi

నీరవ్‌ మోదీ (ఫైల్‌ ఫోటో)

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బ్యాంకే బుధవారం తేల్చింది. దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బుధవారం బీఎస్‌ఈ ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. అయితే ఈ భారీ కుంభకోణానికి, ప్రముఖ వజ్రాల వ్యాపారి, బిలీనియర్‌ నీరవ్‌ మోదీకి లింక్‌లున్నట్టు కూడా ఆరోపించింది.

అయితే 10 రోజుల ముందు వరకు నీరవ్‌ మోదీ అంతపెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు. ఎప్పుడైతే సీబీఐ వద్ద పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు తన ఫిర్యాదును దాఖలు చేసిందో ఇక అప్పటి నుంచి ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. నీరవ్‌ మోదీ ఒక పవర్‌ ఫుల్‌ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, వజ్రాల కొనుగోలుదారి. బ్యాంకుకు దాదాపు రూ.280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నీరవ్‌ మోదీపై ఫిబ్రవరి 5న సీబీఐ కేసు బుక్‌ చేసింది. తర్వాతి వారంలోనే బ్యాంకులోని ముంబై బ్రాంచులో భారీ మొత్తంలో కుంభకోణం చోటు చేసుకుందని, దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది.  ఈ కుంభకోణంతో లింక్‌ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీ, భారత్‌లో అత్యంత చిన్న వయసులోనే బిలీనియర్‌గా ఫోర్బ్స్‌ లిస్టులో చోటు దక్కించుకున్న వ్యక్తి.. 

2.3 బిలియన్‌ డాలర్ల ఫైర్‌ స్టార్‌ డైమండ్‌ వ్యవస్థాపకుడు. వజ్రాల వ్యాపారుల కుటుంబంలోనే పుట్టిన నీరవ్‌ మోదీ, వజ్రాల వృత్తినే తన వ్యాపారంగా ఎంచుకున్నారు.  ఆసియాలోని చైనా నుంచి నార్త్‌ అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాలలో ఆయన తన వ్యాపారాలను విస్తరించారు. 2013లో ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2016 ఫోర్బ్స్‌ బిలీనియర్స్‌ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నీరవ్‌మోదీకి 1,067 ర్యాంకు ఉండగా... భారత్‌లో ఆయన 46వ బిలీనియర్‌గా నిలిచారు. గతేడాది భారత్‌ నుంచి ఫోర్బ్స్‌ జాబితాలో 82వ ర్యాంకును పొందారు. 2014లో ఢిల్లీలో తన తొలి ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను లాంచ్‌ చేశారు. అనంతరం 2016లో న్యూయార్క్‌లో కూడా ఒక స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ఇలా తన వ్యాపారాలను, స్టోర్లను గ్లోబల్‌గా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జువెల్లరీ డిజైన్లకు బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్యాషన్‌కు ఐకాన్‌గా నీరవ్‌ మోదీ జువెల్లరీస్‌ను చెప్పుకోవచ్చు. లగ్జరీ డైమాండ్‌ జువెల్లరీ డిజైనర్‌గా ఆయనకు పేరుంది.

కేవలం వజ్రాలను జువెల్లరీగా ప్రమోట్‌ చేయడమే కాకుండా.. పెట్టుబడులుగా కూడా ప్రమోట్‌ చేస్తున్నారు. అయితే పీఎన్‌బీ నమోదుచేసిన చీటింగ్‌ కేసులో భాగంగా ఐటీ అధికారులు నీరవ్‌ మోదీ ఆఫీసులు ఢిల్లీ, సూరత్‌, జైపూర్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రైడ్స్‌ కూడా జరిగాయి. నీరవ్‌మోదీతో పాటు మరో నాలుగు బడా జ్యుయలరీ సంస్థలపైనా దర్యాప్తు సంస్థలు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ విచారణలో పీఎన్‌బీఐ స్కాంలో నీరవ్‌ మోదీ, బడా జ్యుయలరీ సంస్థల పాత్ర ఏ మేర ఉందో బయటపడబోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement