ఏప్రిల్‌ నుంచి పెట్రోలు ధరల మోత?

We have to pay more for petrol diesel from April 1 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే ఏప్రిల్‌నుంచి ఇంధన ధరలు మోతమోగనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 ఉద్గాన నిబంధనల నేపథ్యంలో పెట్రోలు ధరలు లీటరుకు 70-120 పైసలు పెంచవలసి వుంటుందని కంపెనీలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు తక్కువ ఉద్గారాలతో బీఎస్‌-6 ఇంధనాలను సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, తద్వారా  రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉండనుందని ఐవోసీ ప్రకటించడం ఈ  అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. 

కొన్నిరిమోట్‌ ప్రదేశాల్లో తప్ప దేశం అంతా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఇంధన సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని జాతీయ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  (ఐవోసీ) శుక్రవారం వెల్లడించింది. అతిపెద్ద  చమురు సరఫరాదారుగా ఉన్న ఐవోసీ తమ రిఫైనరీలను తక్కువ సల్ఫర్ డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి చేసేలా అప్‌గ్రేడ్‌ చేయడానికి రూ .17వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని కంపెనీ చైర్మన్ సంజీవ్ సింగ్ మీడియాకు వివరించారు. ధరల పెంపు సంకేతాలను ధృవీకరించిన సంజీవ్‌ సింగ్‌ ఏ మేరకు పెంపు వుంటుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఏప్రిల్ 1 నుండి ఇంధనాల రిటైల్ ధరలలో స్వల్ప పెరుగుదల ఉంటుందని మాత్రం ప్రకటించారు. అయితే వినియోగదారులపై భారం పెద్దగా ఉండదదని  హామీ ఇచ్చారు. ఇక దేశం మొత్తం కొత్త ఇంధనాలపై నడుస్తుందనీ,  గతంలో 50 పీపీఎంతో పోలిస్తే సల్ఫర్ కంటెంట్ 10 పీపీఎం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. తమ చమురు శుద్ధి కర్మాగారాలను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) రూ .35,000 కోట్లు పెట్టుబడి పెట్టగా, అందులో రూ.17 వేల కోట్లు ఐఓసి ఖర్చు చేసిందని చెప్పారు. కాగా బీపీసీఎల్‌ సుమారు 7,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, ఓఎన్‌జీసీకి చెందిన హెచ్‌పీసీఎల్‌ పెట్టబడులపై ఎలాంటి సమాచారం లేదు. అయితే బీఎస్‌-6 సంబంధిత ఇంధనాలతో ఫిబ్రవరి 26-27నుంచే సిద్ధంగా ఉన్నామని మార్చి 1 నుంచి కొత్త ఇంధనాలను మాత్రమే విక్రయిస్తామని హెచ్‌పీసీఎల్‌ ఇప్పటికే ప్రకటించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top