తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లోనూ క్రెడాయ్ చాప్టర్లు!

తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లోనూ క్రెడాయ్ చాప్టర్లు!


సాక్షి, హైదరాబాద్: ప్రసుత్తం క్రెడాయ్‌కి ఆంధ్రప్రదేశ్‌లో 18 చాప్టర్లు, 2,200 మంది డెవలపర్లున్నారు. త్వరలోనే వీటి సంఖ్య 23కు చేరుకోనుంది. నిజామాబాద్,  మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో త్వరలోనే క్రెడాయ్ చాప్టర్లను ప్రారంభించనున్నట్లు భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ ఎస్.రాంరెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ క్రెడాయ్ చాప్టర్లను ప్రారంభిస్తామన్నారు.ఇంకాఏమన్నారంటే..

 సీమాంధ్రలో ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి జిల్లాలు అభివృద్ధి చెందాయి. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరబాటును కేంద్ర ప్రభుత్వం పునరావృతం చేయదు. అందుకే సీమాంధ్రలో ఏర్పాటు చేయబోయే కొత్త రాజధాని ఈ మూడు జిల్లాల్లో ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. అందుకే వేరే జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. దీంతో కొత్త రాజధాని ఉండే ప్రాంతం కేవలం పరిపాలనాపరమైన అభివృద్ధినే సాధిస్తుంది. మిగతా జిల్లాల్లో ఐటీ, ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం ఇస్తారు. కొత్త రాజధాని ఏర్పాటు, సచివాలయం, హైకోర్టు వంటి ప్రభుత్వ విభాగాల ఏర్పాటు కోసం 50 నుంచి 60 వేల ఎకరాల భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది. దీంతో ఆ ప్రాంతంలో ఐటీ, పరిశ్రమల ఏర్పాటు అవకాశం ఇవ్వరు. దీంతో సీమాంధ్ర రాజధానితో సమానంగా ఇతర జిల్లాలూ అభివృద్ధి చెందుతాయి. నిర్మాణ రంగం పరంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కర్నూల్ జిల్లాకు బాగా కలిసొస్తుంది. ఎలాగంటే.. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు గంటన్నరలో చేరుకోవచ్చు. అదే సీమాంధ్ర రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేసినా కర్నూల్‌కు చేరుకోవాలంటే ఎంతలేదన్నా నాలుగు గంటల సమయం పడుతుంది. కర్నూల్ వాసులకు తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల రాజధానులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఎంత రెవెన్యూ వస్తే తెలంగాణ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఇక్కడి ప్రభుత్వం ఎర్ర తివాచీ పరుస్తుంది. ఇప్పటికే ఉన్న ఓఆర్‌ఆర్, మెట్రో, మాస్టర్‌ప్లాన్, విమానాశ్రయం వంటివి అదనపు అంశాలు. 2015 చివరికల్లా హైదరాబాద్‌లో 2.5 కోట్ల చ.గ. విస్తీర్ణంలో బడా బడా ప్రాజెక్టులు రానున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top