గొంతెత్తి ప్రశ్నించండి : మహిళలకు 'ఉష' పాఠం

Usha Sri Addepalli : Why it is important for women to voice their ambitions - Sakshi

ఒక్క ప్రశ్న.. ఎన్నో సమాధానాలకు మూల కారణం అంటారు. ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడే ఏదైనా సాధించగలం అంటారు. కొందరు ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉంటే.. నువ్వేమన్నా క్వశ్చన్‌ బ్యాంకు మింగావా.. అంటూ హేళన చేస్తుంటారు. కానీ ఆ హేళనలు, ఆ ప్రశ్నలే భవిష్యత్తుకు బంగారు బాటలు అవుతుంటాయి. ఇది నేను, నువ్వు కాదు చెప్పింది కాదు. విజయపథంలో దూసుకుపోయిన ఎందరో మహానుభావులు చెప్పిన నగ్నసత్యం. 

''నిన్ను నీవు అడుగు, నీ సహచరులను అడుగు. నీ పై అధికారులను అడుగు.. ఇలా నీ  నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడానికి అడుగుతూనే ఉండండి. ఎప్పుడైతే నీవు ప్రశ్నిస్తావో అప్పుడే నీకో సమాధానం దొరుకుతుంది. అదే నీవు చేరుకోవాల్సిన లక్ష్యాలకు చేరుస్తుంది...ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఐబీఎంలో  టాప్‌ అధికారిగా పనిచేసిన  ఉష శ్రీ అద్దేపల్లి నేర్చుకున్న జీవిత పాఠం.   

 
దాదాపు ఒకే కంపెనీలో 20 ఏళ్లపాటు  నిరాటంకంగా పనిచేస్తూ... పలు విభాగాల్లో తనదైన సత్తా చాటుతూ వస్తున్న ఉష శ్రీ లక్షల మంది యువతను ఆకట్టుకున్నారు. ఒక మల్టినేషనల్‌ టెక్‌ దిగ్గజంలో ఒక మహిళ ఇన్నేళ్ల పాటు పలు కీలక హోదాల్లో  విజయవంతంగా పనిచేస్తూ ఉండటం  ఈ తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

1997లో ఐఐఎం-బెంగళూరు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు.. ఆ రోజు ఇంకా నాకు గుర్తుంది. నేను నాకెంతో ఇష్టమైన బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రంగంలో స్థిరపడాలని ఎంతో కృతనిశ్చయంతో ఉన్నా. ఆ సమయంలో ఐటీ కంటే కూడా బ్యాంకింగ్‌ ఉద్యోగమే ఎంతో గ్లామరస్‌. కానీ ఐబీఎం కంపెనీ ఇచ్చిన ప్రజెంటేషన్‌, నాలో భిన్న దృక్కోణాన్ని మేలుకొల్పింది. నాకున్న జ్ఞానాన్ని, విస్తృత పరుచుకోవడానికి ఇదో మంచి అవకాశంగా ఐటీ రంగంపై నాలో సానుకూల దృక్పథం నెలకొల్పింది. బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం చేయాలనే డ్రీమ్‌ను వదులుకోకుండానే.. మల్టినేషనల్‌ ఐటీ దిగ్గజం ఐబీఎంలో అడుగుపెట్టేశా. అదే నాకు ప్లస్‌ పాయింట్‌గా నిలిచింది. ఒక యంగ్‌ వర్కింగ్‌ ప్రొఫిషనల్‌గా తొలిరోజే ట్రెజరీ బాధ్యతలు నాకు అప్పగించారు. అది ఒక దిగ్గజ ఐటీ కంపెనీకి ప్రధాన బ్యాంకింగ్‌ సేవలు. ఇప్పటికీ ఆ రోజులను మర్చిపోలేనని ఉషా శ్రీ గుర్తుచేసుకున్నారు. 

ఫైనాన్స్‌ నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతి
ఐబీఎం ఇండియాలో  20 ఏళ్లుగా కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న ఉష శ్రీ అద్దేపల్లి ఆర్థిక నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతే ఉంది. వివిధ నాయకత్వ బాధ్యతలను ఆమె తన సొంతం చేసుకున్నారు. ఐబీఎంలో గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌, భారత్‌ దక్షిణాసియా సీఎఫ్‌ఓగా, భారత్‌, దక్షిణాసియా ప్రైసింగ్‌ అధినేతగా, ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ నుంచి వైస్‌ ప్రెసిడెంట్‌, కంట్రోలర్‌ వరకు ఆమె పలు హోదాల్లో కొనసాగారు. ప్రస్తుతం ఆమె భారత్‌, దక్షిణాసియా డొమెస్టిక్‌ బిజినెస్‌ డైరెక్టర్‌, ఫైనాన్స్‌, సీఎఫ్‌ఓగా ఉన్నారు. ప్రతీ బాధ్యతలోనూ ఉష నేర్చుకునే అలవాటును మాత్రం మానుకోలేదు. ఏదో ఒక కొత్త  విషయాన్ని ఆమె అభ్యసిస్తూనే ఉన్నారు. ఎంతో క్లిష్టమైన సవాళ్లను కూడా దీటుగా ఎదుర్కొనే శక్తిని  సంపాదించుకున్నారు. అయితే భారత్‌, దక్షిణాసియాకు ప్రైసింగ్‌ అధినేతగా బాధ్యతలు నిర్వహించడం ఎంతో ప్రత్యేకమైన అనుభవమని, ఆ మూడున్నర ఏళ్లలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినప్పటికీ తన కరియర్‌లో  ఈ సమయం చాలా కీలకమైందన్నారు. ఆర్థిక నిపుణురాలిగా మరచిపోలేని అనుభూతిగా మారడానికి ప్రధాన కారణం తాను వేసే ప్రతి అడుగు, తీసుకునే ప్రతి నిర్ణయం ఐబీఎంపై నేరుగా ప్రభావం చూపేవని,అంతటి విశిష్టమైన స్థానాన్ని తాను సొంతం చేసుకున్నానని ఉష ఎంతో గర్వంగా చెప్పారు.  

ఒకే కంపెనీలో 20 ఏళ్లు బోర్‌ రాలేదా?
ఒకే కంపెనీలు 20 ఏళ్లు అంటే, చాలా తక్కువ మందే చేస్తారు. బోర్‌ వస్తుందని కంపెనీ మారడమో, లేదా వేతనం కోసమో లేదా మరేదైనా మంచి అవకాశం రావడమో చాలా మంది ఉద్యోగులు తమ కంపెనీలను మారుస్తూ ఉంటారు. ఇదే విషయంపై ఉషకు ఇటీవల జరిగిన పూర్వ విద్యార్థుల సమావేశంలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఐబీఎంలో 20 ఏళ్లుగా ఉంటున్నారు. ఎప్పుడు బోర్‌ రాలేదా? అని. ''ఐబీఎం అనేది గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల కలయిక. వివిధ వ్యాపారాల్లో, అదే విధంగా వివిధ ప్రాంతాల్లో పనిచేసే అవకాశాన్ని ఐబీఎం తన ఉద్యోగులకు కల్పిస్తుంది. ఈ విధంగా ఐబీఎం తరహాలో ఆఫర్‌చేసేవి చాలా తక్కువగా ఉండొచ్చు కానీ ఐబీఎం కంపెనీ తన ఉద్యోగులకు పలు అవకాశాలకు ప్రోత్సహం అందిస్తుంది.

ఒక మహిళగా ఇంటి బాధ్యతలు, పిల్లలని చూసుకోవడం, ఇటు ఆఫీసుల్లో కీలక బాధ్యతలు పోషించడం సవాలే. డెలివరీ సమయంలో, ఆ అనంతరం కంపెనీ అందించిన సహకారంతో... ఇంటి నుంచే కొత్త బాధ్యతలు నిర్వర్తించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా పెద్ద పెద్ద బాధ్యతలు నాకు అప్పగించడంలో ఎలాంటి వెనుకంజ వేయలేదు కంపెనీ.  నాపై చూపిన నమ్మకం, విశ్వాసంపై నేడు నిజంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి'' అని ఉష తెలిపారు. నేను నా భర్తతో కంటే ఐబీఎంతో గడిపిన రోజులే ఎక్కువని  సరదాగా జోక్‌ చేస్తారామె. 

ఒక వ్యక్తి సామర్థ్యాన్ని జడ్జ్‌ చేయడానికి లింగ బేధాలను ప్రమాణీకరంగా తీసుకోకూడదని ఉష నిరూపించారు. ఇదే కారణంతో ఉష 20 ఏళ్లుగా ఐబీఎంలో సక్సస్‌ఫుల్‌గా తన జర్నీని కొనసాగిస్తున్నారు. ఒక మహిళను, ఇలా కాదు అలా ఉండాలి అనే భావన నాకెన్నడూ రాలేదు. నువ్వు ఏం చేస్తున్నావో అదే కరెక్ట్‌ అనే నమ్మకాన్ని ఐబీఎం నాలో కల్పించిందన్నారు ఉష. 

జీవితంలో ప్రతి దశలోనూ ప్రాధాన్యతలు పలు రకాలుగా ఉంటాయి. వాటిని రీబ్యాలెన్సింగ్‌ చేసుకోవాల్సినవసరం ఎంతో అవసరం. కానీ ఒక్కోసారి మహిళలు ఏదో ఒక దగ్గర కన్‌ఫ్యూజన్‌కి గురవుతారు. ఈ కన్‌ఫ్యూజనే తమలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఆ కన్‌ఫ్యూజన్‌ గుర్తించి, దానికి పరిష్కారం కనుగొనాలి. ఈ పరిష్కారమే మహిళలకు ఎంతో శక్తివంతమైనదిగా మారుతోంది. ఒకవేళ అలా కానీ పక్షంలో మన ముందున్న ఎంతో మంచి అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది.    

- కొటేరు శ్రావణి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top