ఎన్‌సీఎల్‌టీ కేసుల నుంచి రూ. 3,000 కోట్ల రికవరీ

UBI expects Rs 3000 crore recovery from NCLT resolutions - Sakshi

యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అంచనాలు

కోల్‌కతా: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)కి సిఫార్సు చేసిన పలు మొండి ఖాతా కేసుల నుంచి దాదాపు రూ. 3,000 కోట్లు రికవర్‌ కాగలవని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) ఎండీ పవన్‌ బజాజ్‌ తెలిపారు. ఇప్పటిదాకా 40 కేసులను ఎన్‌సీఎల్‌టీకి సిఫార్సు చేశామని, దాదాపు రూ. 580 కోట్లు రికవర్‌ అయ్యిందని బ్యాంక్‌ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ వద్ద ఉన్న కేసులన్నీ.. సెటిల్మెంట్‌ తుదిదశలో ఉన్నాయని బజాజ్‌ చెప్పారు.

ఈ ఏడాది మార్చి 31 నాటికి యూబీఐ స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 24 శాతంగా ఉందని తెలిపారు. కరెంటు అకౌంటు, సేవింగ్స్‌ అకౌంటు నిష్పత్తి అధికంగానే ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగినంత స్థాయిలో లిక్విడిటీ ఉందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో యూబీఐ రూ. 220 కోట్ల నికర నష్టం నమోదు చేసిందని, వచ్చే ఏడాది మార్చి ఆఖరు నాటికి మళ్లీ లాభాల్లోకి మళ్లగలదని ఆయన వివరించారు.  

రూ.1,500 కోట్లు సమీకరిస్తాం
 న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.1,500 కోట్ల నిధులు సమీకరించనున్నది. ఒకటి లేదా అంతకు మించిన విడతల్లో ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ పెట్టుబడులు సమీకరిస్తామని యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది.

శుక్రవారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారులు ఈ మేరకు తమ ఆమోదాన్ని తెలిపారని బ్యాంక్‌ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకు ఇది అదనమని వివరించింది. ఈ పెట్టుబడుల వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్‌ 0.3 శాతం నష్టంతో రూ.11.05 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top