ఉబెర్‌ రైడ్స్‌కు యూపీఐ ద్వారా చెల్లింపు

ఉబెర్‌ రైడ్స్‌కు యూపీఐ ద్వారా చెల్లింపు - Sakshi


ఎన్‌పీసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో భాగస్వామ్యం

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్‌ తాజాగా తన ప్లాట్‌ఫామ్‌కు యూపీఐ సేవలను అనుసంధానించింది. దీని కోసం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ), యాక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఉబెర్‌ ప్లాట్‌ఫామ్‌లో రిజిస్టర్‌ అయిన 4.5 లక్షలకుపైగా డ్రైవర్లు యూపీఐ ద్వారా పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు. అంటే మనం కూడా ఉబెర్‌ రైడ్స్‌కు అయిన మొత్తాన్ని యూపీఐ ద్వారా చెల్లించొచ్చు. కాగా ఇప్పటి వరకు యూజర్లు క్యాష్, డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, పేటీఎం వాలెట్‌ ద్వారా ఉబెర్‌ రైడ్స్‌కు చెల్లింపులు చేస్తున్నారు.



ఆ మూడు మార్కెట్‌లపై ప్రధాన దృష్టి

ఉబెర్‌.. భారత్, బ్రెజిల్, మెక్సికో మార్కెట్లపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. తద్వారా కంపెనీ వృద్ధిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఈ ఏడాది జూలైలో భారత్‌లో 115 శాతం వృద్ధిని సాధించినట్లు ఉబెర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (గ్లోబల్‌ బిజినెస్‌) డేవిడ్‌ రిచ్‌టర్‌ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు.



తమ ప్లాట్‌ఫామ్‌ను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా చేయడానికి మరిన్ని సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇప్పటికే కంపెనీ ఈ దిశగా పలు చర్యలు తీసుకుందని, ప్లాట్‌ఫామ్‌కు యూపీఐ సేవల అనుసంధానం ఇందులో భాగమేనని తెలిపారు. తమకు అమెరికా వెలుపల భారత్‌ అతిపెద్ద మార్కెట్‌ అని గుర్తు చేశారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ... అందుబాటులో ఉండే, అభివృద్ధికి సహకరించే టెక్నాలజీలను కలిగి ఉండటమే డిజిటల్‌ ఇండియా ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top