
వాషింగ్టన్ : ప్రపంచంలో అతిపెద్ద టొబాకో కంపెనీలు ఒక్కో స్మోకర్ మరణంపై 9730 డాలర్లు ( రూ 6లక్షలకు పైగా) లాభం పిండేస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది. ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లోని పొగరాయుళ్లను ఈ కంపెనీలు పీల్చిపిప్పిచేస్తున్నాయని వెల్లడించింది. ప్రపంచాన్ని వణికిస్తున్న పొగాకు పర్యవసానాలపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, వైటల్ స్ట్రేటజీస్ సంస్ధలు టొబాకో అట్లాస్ నివేదికను రూపొందించాయి.
పొగాకు పరిశ్రమ తమ లాభాలు పెంచుకునేందుకు అనుసరిస్తున్న తాజా ఉత్పత్తులు, ఎత్తుగడలతో పాటు పొగాకు నియంత్రణ చర్యలను ఇవి ఎలా నీరుగారుస్తున్నాయో నివేదిక వెల్లడించింది. కేవలం 2016లోనే ప్రపంచవ్యాప్తంగా పొగాకు సేవనంతో 71 లక్షల మంది మృత్యువాత పడ్డారని, వీటిలో అత్యధిక మరణాలు సిగరెట్ స్మోకింగ్ వల్ల కాగా, 8,84,000 మరణాలు సెకండ్‌హ్యాండ్ స్మోక్ కారణంగా సంభవించాయి.
అదే సమయంలో పొగాకు కంపెనీల లాభాలు 6200 కోట్ల డాలర్లు పెరిగాయని నివేదిక పేర్కొంది. ఇది పొగతాగడం వల్ల చోటుచేసుకున్న ఒక్కో మరణానికి 9730 డాలర్లతో సమానమని గతంలో ఇది 7000 డాలర్లుగా ఉందని ఈ నివేదిక లెక్కగట్టింది.