టెల్కోలకు రూపాయి దెబ్బ

Telecom sector in trouble with rupee fall - Sakshi

డీజిల్‌ రేట్లతో నిర్వహణ వ్యయాలు భారం

రూపాయి పతనం ఖరీదు రూ.4 వేల కోట్లు

డీజిల్‌తో రూ.2,000 కోట్ల దాకా తగ్గనున్న ఎబిటా

ముంబై: తీవ్ర పోటీతో సతమతమవుతున్న టెలికం రంగానికి తాజాగా రూపాయి పతనం, డీజిల్‌ రేట్లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూపాయి పతనం కారణంగా టెల్కోలపై రూ.4,000 కోట్ల మేర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇక పెరిగే డీజిల్‌ రేట్ల మూలంగా నిర్వహణ వ్యయాలూ పెరిగి కంపెనీల లాభదాయకత మరో రూ.2,000 కోట్లు మేర తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 5 లక్షల కోట్ల పైగా రుణభారంతో అల్లాడుతున్న టెల్కోలకు ఇది మరింత భారంగా మారనుంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం మూలంగా టెల్కోల ఎబిటా (పన్నుకు ముందు ఆదాయం) 7–8 శాతం మేర తగ్గవచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా వైస్‌ ప్రెసిడెంట్‌ హర్‌‡్ష జగ్నాని తెలిపారు. ఇక డీజిల్‌ అంశం కూడా తోడైతే ఇది మొత్తం పది శాతం దాకా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

రూపాయి క్షీణత మూలంగా విదేశీ మారకంలో తీసుకున్న రుణాల రీపేమెంట్‌ మరింత పెరుగుతుందని, ఇక నెట్‌వర్క్‌ విస్తరణ, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ వ్యయాలు కూడా పెరుగుతాయని ఆయన తెలియజేశారు. 2018 మార్చి 31 నాటికి పరిశ్రమ మొత్తం రుణ భారం రూ. 4.7 లక్షల కోట్లుగా ఉండగా... ఇందులో విదేశీ రుణం సుమారు రూ.1 లక్ష కోట్ల దాకా ఉంది. దీనిలో మళ్లీ 70 శాతం రుణాలు డాలర్‌ మారకంలోనే ఉన్నాయి. ఇదే టెల్కోలను కలవరపెడుతోంది.

టవర్‌ కంపెనీలకు కూడా సెగ..
దేశీయంగా 4.7 లక్షల టెలికం టవర్లుండగా... వీటిలో సుమారు పావు శాతం టవర్లు మాత్రమే నామమాత్రపు డీజిల్‌ వాడకంతో నడుస్తున్నాయి. మిగతావన్నీ ప్రధానంగా డీజిల్‌పై ఆధారపడినవే. ప్రస్తుతం రేట్ల పెరుగుదల వల్ల టెలికం టవర్‌ సైట్ల ఇంధనాల వ్యయాలు పెరగనున్నాయి. సాధారణంగా టవర్‌ సైట్‌ల నిర్వహణకు సంబంధించి డీజిల్‌ వ్యయాలు పరిశ్రమకు సుమారు రూ.13,000 కోట్ల మేర ఉంటోంది. డీజిల్‌ రేట్లు సుమారు 15 శాతం పెరిగిన పక్షంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఎబిటాపై 3–4% ప్రభావం పడి... కంపెనీల ఎబిటా దాదాపు రూ. 2,000 కోట్ల మేర తగ్గనుంది.

ఒకవైపు.. రిలయన్స్‌ జియో ప్రారంభించిన రేట్ల యుద్ధంతో భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్‌ ఇండియాలు ఇప్పటికే నష్టాలు నమోదు చేస్తున్నాయి. ఇక దీనికి రూపాయి, డీజిల్‌ కూడా తోడైతే ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది. డీజిల్‌ రేట్ల పెరుగుదల సెగ కేవలం టెలికం ఆపరేటర్లకే కాకుండా కొన్ని టవర్‌ కంపెనీలకు కూడా తగలనుంది. టవర్‌ సైటు ఇంధన వ్యయాలను కొన్ని సందర్భాల్లో టవర్‌ కంపెనీలు, టెల్కోలు కలిసి భరిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా టవర్‌ కంపెనీల నిర్వహణ వ్యయాల్లో విద్యుత్, ఇంధన వ్యయాల వాటా 30–40% ఉంటుంది.

తమ ఒప్పందాలను బట్టి డీజిల్‌ రేట్ల పెరుగుదలలో కొంత భాగాన్నే టవర్‌ కంపెనీలు.. టెల్కోలకు బదలాయించగలుగుతాయి. అయితే, సౌర విద్యుత్, ఫ్యూయల్‌ సెల్స్‌ వంటి పునరుత్పాదక విద్యుత్‌ వనరులను వినియోగిస్తూ.. డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నందున రేట్ల భారం మరీ భారీ స్థాయిలో ఉండకపోవచ్చని టవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ వర్గాలు చెబుతున్నాయి. 2011–12 లో ఒక్కో టవర్‌ నిర్వహణకు ఒక్కో సంస్థ రోజుకు 7.34 లీటర్ల డీజిల్‌ ఖర్చు పెట్టేదని, ఇది 2015–16 నాటికి 4 లీటర్లకు తగ్గిపోయిందని వివరించాయి.

రూపాయికి మరింత చిల్లు
డాలర్‌తో 74.39కు పతనం
చమురు ధరల తాజా పెరుగుదల ప్రభావం
ముంబై: రూపాయి మరింత బలహీనపడింది. మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో మరో 33 పైసలు కోల్పోయి నూతన జీవిత కాల కనిష్ట స్థాయి 74.39వద్ద ముగిసింది. అధిక చమురు ధరలు, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లడం రూపాయి బలహీనతకు కారణమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంకులు, ఎగుమతిదారులు చేసిన డాలర్ల అమ్మకాలతో రూపాయి 18పైసలు కోలుకుని 73.88 వరకు వెళ్లింది. అయితే, బ్రెంట్‌ క్రూడ్‌ మరోసారి 84 డాలర్ల మార్కుపైకి వెళ్లడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ బలపడడంతో రూపాయి యూటర్న్‌ తీసుకుని నష్టాలవైపు ప్రయాణించింది.

సోమవారం కూడా 30 పైసల నష్టంతో రూపాయి 74.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. విదేశీ నిధులు భారీగా బయటకు వెళ్లిపోవడం రూపాయిపై ప్రభావం చూపించినట్టు ఫారెక్స్‌ ట్రేడర్ల అభిప్రాయం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు బలమైన డిమాండ్, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళన, పెరిగే చమురు ధరలు కూడా ప్రభావం చూపించినట్టు చెప్పారు. ‘‘బ్యాలన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌ ప్రతికూలంగా మారడంతో రూపాయి గడిచిన రెండు నెలల్లో వేగంగా బలహీనపడింది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆసియాలో ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి డాలర్‌తో ఎక్కువగా నష్టపోయింది’’ అని నోమురా తన పరిశోధన నివేదికలో పేర్కొంది.

ఆర్‌బీఐ నుంచి విధానపరమైన చర్యల్లేకపోవడం రూపాయిపై ఆందోళనలను పెంచినట్టు తెలిపింది. చమురు ధరల క్షీణత ఒక్కటే రూపాయి ఈ సమయంలో స్థిరపడేందుకు సాయపడుతుందని పేర్కొంది. ‘‘అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి. పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 3.26 శాతానికి పెరిగింది. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని అమెరికా ట్రెజరీల్లో ఇన్వెస్ట్‌ చేస్తారన్న భయాలు ఉన్నాయి. చమురు ధరలు కూడా ఒక శాతం పెరిగి 84.7 డాలర్లకు చేరాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ హెడ్‌ వీకే శర్మ తెలిపారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top