సమయం లేదు మిత్రమా... ఐదు రోజులే..! | Tax saving investments | Sakshi
Sakshi News home page

సమయం లేదు మిత్రమా... ఐదు రోజులే..!

Mar 26 2018 1:41 AM | Updated on Mar 26 2018 1:41 AM

Tax saving investments - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియటానికి నిండా నాలుగైదు రోజులే ఉంది. మార్చి 31తో ముగిసిపోతోంది. ఆదాయపన్ను జీవులు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు అవకాశం పొందాలంటే అర్హత కలిగిన సాధనాల్లో ఆ మేరకు ఇన్వెస్ట్‌ చేయాలి. బీమా, పీపీఎఫ్, ఎన్‌పీఎస్, ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఇలా ఎన్నో సాధనాలున్నాయి. ఇప్పటికే మీరు చేసిన పెట్టుబడులు ఆ మేరకు ఉంటే ఫర్వాలేదు. లేదంటే పన్ను ఆదా కోసం బాగా ప్రాచుర్యంలో ఉన్న వాటిలో అనుకూలమైనవి ఎంచుకోవచ్చు. అందుకు పరిశీలించాల్సినవి ఇవే... – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం

ఈఎల్‌ఎస్‌ఎస్‌...
ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) అన్నది ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. సెక్షన్‌ 80సీ కింద వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉంది. ఇవి మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌తో ఉంటాయి. అప్పటి వరకు విక్రయించేందుకు అవకాశం ఉండదు. వీటిలో గ్రోత్, డివిడెండ్‌ ఆప్షన్లలో నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పూర్తిగా ఈక్విటీ మార్కెట్‌ ఆధారిత పథకాలు కనుక వీటిలో పెట్టుబడులపై రాబడులు ఎంతొస్తాయన్నది చెప్పడం కచ్చితంగా సాధ్యం కాదు.

అయితే, గడిచిన ఐదేళ్లలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల సగటు రాబడులు వార్షికంగా 18.5 శాతం ఉన్నాయని గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. రిస్క్‌ భరించే ఇన్వెస్టర్లకు అధిక రాబడుల పరంగా ఇవి అనువైనవి. ఆర్థిక సలహాదారులు సైతం ఇతర పథకాల కంటే పన్ను ఆదా కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలనే ఎక్కువగా సూచిస్తుంటారు. ఇతర పథకాలతో పోలిస్తే తక్కువ లాకిన్‌ పీరియడ్‌ తక్కువగా ఉండటం ఆకర్షణీయ అంశం. ఇక ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో సిప్‌ మోడ్‌ ఎంచుకోవడం ద్వారా సగటున అదనపు రాబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది.

నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)...
ఈ పింఛను పథకంలో ఎవరైనా చేరొచ్చు. సెక్షన్‌ 80సీ కింద వార్షికంగా రూ.1.50 లక్షలకు పన్ను మినహాయింపునకు ఇందులో ప్రయోజం పొందొచ్చు. అలాగే, మరో రూ.50,000 వరకు ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసి సెక్షన్‌ 80సీసీడీ కింద కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. దీంతో మొత్తం రూ.2 లక్షలపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల పరిమితి దాటి చేసే పెట్టుబడులపైనే సెక్షన్‌ 80సీసీడీ కింద రూ.50,000కు ఎన్‌పీఎస్‌లో పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ఉదాహరణకు సెక్షన్‌ 80సీ కింద మీరు ఈఎల్‌ఎస్‌ఎస్, పీపీఎఫ్, ఎన్‌పీఎస్‌లో రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్‌ చేసినట్టయితే, మరో రూ.50,000లను ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టి దానిపైనా పన్ను ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఎన్‌పీఎస్‌ పథకంలో 60 ఏళ్లు కాల వ్యవధి. ఆ తర్వాత పథకం నుంచి వైదొలగొచ్చు. అప్పటి కార్పస్‌లో 60 శాతాన్నే వెనక్కి తీసుకోగలరు.

మిగిలిన 40 శాతాన్ని పెన్షన్‌ యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. పెట్టుబడుల ఉపసంహరణలో 40 శాతంపైనే పన్ను మినహాయింపు. మిగిలిన 20 శాతంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ 60 శాతాన్ని యాన్యుటీలో ఇన్వెస్ట్‌ చేస్తే పన్ను ఉండదు. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌లో డెట్, ఈక్విటీతో కూడిన పెట్టుబడి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఎందులో చూసినా రాబడులు 9–12 శాతం మధ్య ఉన్నాయి.


ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌)..
ప్రభుత్వ హామీతో కూడిన పథకం. పెట్టుబడులపై పన్ను ఆదా, రాబడులకూ పన్ను మినహాయింపు ఉంది. పన్ను రహిత అధిక రాబడులను అందించే డెట్‌ పథకం. స్థిరాదాయ పన్ను రహిత సాధనం. పీపీఎఫ్‌లో వార్షికంగా చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్‌ 80సీ కింద పూర్తి పన్ను మినహాయింపు పొందొచ్చు.

ప్రభుత్వ సెక్యూరిటీల ఈల్డ్స్‌తో పీపీఎఫ్‌ పథకాన్నీ కేంద్ర ప్రభుత్వం ముడిపెట్టడం, ఎప్పటికప్పుడు మార్కెట్‌ రేట్లకు అనుగుణంగా త్రైమాసికంవారీగా వడ్డీ రేట్లను సమీక్షిస్తుండటం చిన్న ప్రతికూలత. అయితే, పీపీఎఫ్‌లో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణలపై పూర్తిగా పన్ను మినహాయింపు ఉండటంతో పన్ను ఆదాతో కూడిన మెరుగైన రాబడులకు ఇది ఇప్పటికీ మెరుగైన సాధనమేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం ఇందులో 7.9% వడ్డీ రేటు అమల్లో ఉంది.

సుకన్య సమృద్ధి యోజన..
ఒకరిద్దరు కుమార్తెలున్నవారు వారి వయసు గనక 10 ఏళ్లలోపు ఉంటే ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈక్విటీతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వ పథకమిది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు, కాంపౌండింగ్‌ ప్రయోజనంతో కుమార్తె ఉన్నత విద్య, వివాహ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ పథకంలో ఏటా కనీసం రూ.1,000, గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ఏడాదిలో ఎన్నిసార్లయినా ఈ పరిమితికి లోబడి డిపాజిట్లు చేయొచ్చు.

ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు చిన్నారుల పేరిటే ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఉంటుంది. ఖాతా తెరిచాక 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలి. గరిష్టంగా ఖాతా తెరిచాక 21 ఏళ్ల పాటు లేదా అమ్మాయికి 18 ఏళ్లు నిండి వివాహం అయ్యేంత వరకు ఖాతా మనుగడలో ఉంటుంది. 18 ఏళ్లు నిండినా లేక 10వ తరగతి ఉత్తీర్ణత సాధించినా ఆ అవసరాల కోసం అప్పటి ఖాతా విలువలో 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అర్హత అవుతుంది.

ఈ పథకంలో ప్రస్తుతం 8.1 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. మిగిలిన పన్ను ఆదా పథకాలతో పోలిస్తే ఎక్కువే. ప్రతీ త్రైమాసికానికీ ఈ పథకంపై వడ్డీరేటును కేంద్రం సమీక్షిస్తుంటుంది. ఏటా రూ.1.5 లక్షల పెట్టుబడులకు సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపులు పొందొచ్చు. పెట్టుబడులపై వచ్చే వడ్డీకి, కాల వ్యవధి తీరాక చేతికందే మొత్తానికి కూడా పన్ను లేదు.

పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు...
బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా సెక్షన్‌ 80సీ కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. అయితే అన్ని రకాల డిపాజిట్లకు ఈ ప్రయోజనం లేదు. కేవలం పన్ను ఆదాతో కూడిన ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్లపైనే ఈ అవకాశం. వీటికి ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌ ఉంటుంది. ఆలోపు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండదు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ డిపాజిట్లను అందిస్తున్నాయి. వడ్డీ రేటు 6.5–7 శాతం వరకు లభిస్తోంది. పోస్టాఫీసుల ద్వారా కూడా ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

బీమా పథకాలు
మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల జీవిత బీమా పథకాలకు చేసే ప్రీమియం చెల్లింపులపై సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు అమల్లో ఉంది. యులిప్‌లు, టర్మ్‌ ప్లాన్‌లు, సంప్రదాయ బీమా పథకాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. బీమా పథకాల్లో చేసే పెట్టుబడులపై, జీవించి ఉంటే అందుకునే రాబడులు, అలాగే మరణ పరిహారంపైనా పన్ను లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement